శ్రావణ మాసం - లక్ష్మీప్రదమైన కాలం

 
భగవంతుడు అనేక సార్లు లోకంలో అవతరించాడు. ఒక్కో సారి మానవుడిగా మాత్రమే వచ్చాడు, ఒక్కోసారి మానవుడి రూపంలో వచ్చినా మానవుడి శక్తికి అందని విదంగా ప్రవర్తించాడు. వామన అవతారంలో స్వామి మానవునిగా వచ్చాడు, కానీ తాను అడిగిన మూడు అడుగులు ఇవి అని చూపిస్తూ ముల్లోకాలని కొలిచాడు తన పాదాలతో. అయిటే మానవుడిగా వచ్చినా మానవుడు అని అనడానికి వీలు లేదు! ఒకసారి పరశురాముడిగా వచ్చాడు, గండ్ర గొడ్డలి చేత పట్టుకొని భూమిచుట్టూ ఇరవై ఒక్క సార్లు చుట్టి దుష్టపాలకులను ఏరిపారేసాడు. మానవ రూపంలో ఉన్న సేవించుకోవాలంటే కొంచం భయం వేస్తుంది. కృష్ణావతారం లోకం లోనికి జ్ఞానోపదేశం చేయడానికి వచ్చిన అవతారం. ఇదీ మనుషిగానే వచ్చిన అవతారం. "అవజానంతి మూడాః మానుషీ తను మాశ్రితం", మీకోసమని మనుషి రూపంలో వస్తే నన్ను బొత్తిగా గుర్తించడం లేదే అని చివాట్లు పెట్టాల్సి వచ్చింది. నేను మనిషిని కాదు దైవాన్ని అని చెప్పుకున్నాడు. తాను ఏ అవతారం ధరించినా మొదట ఆయనలో కలగ వల్సినవి ఏవి ? అంటే భగవంతునికి మనపై కలగాలి జాలి, దయ, కృప. మనల్ని బాగు చేయాలీ అని ఆయన హృదయంలో కలగాల్సిన కారుణ్యం.  మన దుఃఖాన్ని చూసి ఆయనలో ఒక కరుగుదల ఏర్పడాలి, మన దుఃఖాన్ని తొలగించాలని కోరిక కలగాలి. అప్పుడు ఆయన ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తాడు. అయితే ఆయనలో దయ, కారుణ్యాది గుణాలని బయటికి తెచ్చేది అమ్మ ఆయన వద్ద నిరంతరం ఉంటుంది. ఆ అమ్మకు అనేక రకాల పేర్లు ఉన్నట్లు మనం గ్రంథాల్లో చూస్తున్నాం. ఆమెకి లక్ష్మీ అని పేరు. శ్రీ అని పేరు. ఇందిరా అని పేరు. లోక మాతా, రమా, మంగళ దేవతా అని ఇలా ఎన్నేన్నో పేర్లు. అయితే ప్రసిద్దమైన పేర్లు 'లక్ష్మీ' మరియూ "శ్రీ", ఇవి వేదం చెప్పిన పేర్లు.  అమె చేసే ఉపకారాలను బట్టి ఎన్నెన్నో పేర్లు చెప్పినా "హ్రీశ్చతే లక్ష్మీచ పత్-న్యౌ" లేక "శ్రీ భవతు " అంటూ వేదం చెబుతుంది. అందుకే భగవంతుణ్ణి గుర్తించేప్పుడు ఆయనలోని దయాది గుణాలను పైకి తెచ్చే నామంతో గుర్తించాలి. అందుకే ఆయనని శ్రీపతి లేక శ్రియపతి అని పిలుస్తుంటారు. లేదా లక్ష్మీనాథా అని పిలుస్తుంటారు. ఆయనకంటూ నారాయణ, విష్ణు అనే ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ప్రచురంగా కనిపించే నామం శ్రీపతి అనో లేక లక్ష్మీనాథా అనో. ఆవిడ సంబంధం ద్వారా వచ్చిన నామాలు కనుక. అంటే ఆమె ఆయనలో పెంచిన దయ ద్వారా మనల్ని గుర్తిస్తాడు అని భావిస్తాం.

  

లక్ష్మీదేవి భగవంతునిలో దయను ఎట్లా పెంచుతుందో ఆమె పేరులో ఉన్న పదాలే తెలుపుతాయి. ఏదైన ఒక వ్యక్తి గుర్తించాలంటే ఆవ్యక్తికి సంబంధించిన అసాధారణ చిహ్నాలు కనిపించాలి. ఈ అసాధారణ గుర్తును సంస్కృతంలో 'లక్ష్మా' అని అంటారు. అయితే భగవంతుణ్ణి గుర్తించటానికి గుర్తు ఏది ? అంటే దయ. ఆయనలో ఎన్నో గుణాలు జ్ఞానం శక్తులు ఉండవచ్చు. కాని మనం ఆయనని ఆశ్రయించాలంటే మొదట మనం చూసేది ఆయనలోని దయనే. ఆయనకు ఎంతో జ్ఞానం ఉంటుంది అంటే మనం చేసిన తప్పులు కనిపిస్తాయి, అందుకు మనల్ని దండిస్తాడు అంటే మనం ఆయనని ఆశ్రయించనే ఆశ్రయించం. మనలోని దోశాలను ఆయన గుర్తించినా మనపై దయతో దగ్గరికి తీసి ఇకపై జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనల్ని కాపాడుతా అని చెబితే మనం ఇష్టపడతాం. ఇది ఆయనలో ఉండే అసాధారణ గుర్తు. అట్లా ఆయనలో అసాధారణ గుర్తు అయిన దయని పెంచి పోశించే ఆవిడకి 'లక్ష్మీ' అని పేరు. ఆయనను గుర్తింపజేసే తాను అమే 'లక్ష్మీ'. ఆమెను కలిగిన వాడు తత్వం అంటే, అట్లాంటి తత్వాన్ని ఉపాసించండి అని వేదం చెబుతుంది. అందుకే మన పూర్వ ఆచార్యులు "వేదాంతాః తత్వచింతాం మురభిత్ ఉవసి యత్ పాద చిహ్నైహి పరంతి" అని అంటారు. అంటే వేదార్థాన్ని నిర్ణయం చేసిన శాస్త్రాలన్ని కూడా ఏది తత్వం, ఏది లోకాన్ని శాసించేది ? ఏది లోకంచే ఉపాసించబడే తత్వం ? అని సందేహాలు బయలుదేరినప్పుడు ఎవరి వక్షస్థలం యందు అమ్మ యొక్క పాద చిహ్నాలు చూసి అతడే మనం ఉపాసించాల్సిన తత్వం అని చెబుతాయి.