మాఘమాసం - రథసప్తమి


రామచంద్రుడు రావణుణ్ణి ఎలా వధించాలి అని చింత చేస్తుండగా అగస్త్యుడు వచ్చి భయాలు శత్రుపీడ తొలగడానికి, ఆరోగ్యం విజయం శుభం కలగటానికి ఇది చదువుకో అని ఆదిత్య హృదయన్ని భోదించాడు. అది చదివాక రాముడు రావణుణ్ణి అవలీలగా సంహరించగలిగాడు.

విజయాన్ని, ఆరోగ్యాన్ని మరియూ ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమోత్తమ గ్రంథరాజమని ఆనాడు అగస్త్యుడు రామ చంద్రునికి ఆదిత్యహృదయాన్ని చెబితే, దాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో అదించాడు. అది సూర్యుడి గురించి అందించిన స్తోత్రం కనుక సూర్యుడి ఆవిర్భావ దినం అయిన రథసప్తమి నాడు చేస్తే మంచిది. అది జరిగింది ఈ మాఘమాసంలో కనుక ఈ మాసం మొత్తం ఆదిత్యహృదయాన్ని పారాయణ చేయ్యవచ్చు. మాఘమాసంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య దాకా రోజు తెలవారే సమయంలో లేచి స్నానమాడి, పాయసాన్ని తయారు చేసి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్యుడికి పాయసాన్ని నివేదన చేసి నలుగురికి పంచడం చేస్తే మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందినవాళ్ళం అవుతాం. రాముడు లంకలో ఉన్న రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి దగ్గరికి చేర్చుకున్నాడు. రావణుడు, కుంభకర్ణుడు మరియూ విభీషణుడు ఉన్న లంకానగరం వంటిదే మన శరీరం.  మనలో రాజసిక, తామసిక మరియూ సాత్విక ప్రవృత్తులు ఉంటాయి. రాజసిక, తామసిక గుణములని అణిచివేయాలి, సాత్వికాన్ని పెంపొందించుకోవాలి. అదిత్యహృదయ పారాయణ వల్ల మనలో అంతర శత్రువులు అయిన రాజసిక, తామసిక ప్రవృత్తులని అణిచివేయగలుగుతాం.

సమయం అనేది చాలా గొప్పది. సమయం అనేది ఎవరి కొరకు ఎదురు చూడదు. ఆగమంటే ఆగదు. పొమ్మంటే పోదు. దాని మానాన అది సాగుతూ ఉంటుందే తప్ప ఒకరి కోసమని ఎదురు చూడటం అనేది కాలానికి ఉండదు. కానీ దాన్ని వాడుకోవడం అనేది మన పని. దాన్ని ఎట్లా వాడుకోవడం అనేది మనపై ఆధారపడి ఉంటుంది. ఉదయపు సమయంలో ఒక ప్రయోజనం, మధ్యాహ్నం మరొక ప్రయోజనం, సాయంత్రం మరొక ప్రయోజనం ఉంటుంది. ఇలా మనం దినంలో అయా సమయాన్ని వాడుకో గలిగితే ఆయా ప్రయోజనం పొందగలుగుతాం. వాడుకోక పోతే మనం నష్టపోతాం. పంట రావడానికి గింజ ఎప్పుడు నాటాలో నియమం ఉంటుంది. నావద్ద గింజ ఉంది నేను ఇప్పుడే నాటుతాను అని నాటితే మొక్క వస్తుంది కానీ మనం కోరుకునట్లుగా పంట రాదు. అదే సమయానికి నాటితే ఫలితం పూర్తిగా వస్తుంది. మనకు తగినట్లు, మనం కోరినట్లు ఫలితం రావాలంటే ఏ సమయం తగినతో అది తెలుసుకొని నాటాలి. ఈ నాడు సూర్యుడి అవతార దినం కనుక ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే తగ్గ ఫలితం వస్తుంది. ఈ మాసం మొత్తం పాయసంతో సూర్య ఉపాసన చేస్తే మంచిది అని మన పెద్దల నిర్ణయం. దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం.