మన పూర్వ ఆచార్యుల్లో భగవద్రామానుజులవారికి వయస్సులో
పెద్దవారే అయినప్పటికి శిష్యుడిగా ఉండి, గొప్ప జ్ఞానం కల మహనీయులు
కూరేశులు. పరాశర బట్టర్ యొక్క పిత్రుపాదులు. వారినే కూరేశమిశ్రులు అని
అంటారు. కూరతాల్వాన్ అని, శ్రీవత్స చిన్హులు, శ్రీవత్స చిన్హమిశ్రులు అని
వారి తిరునామములు. వారు మొదట కాంచీపురం ప్రక్కన కూరం అనే గ్రామంలో
జమీందారుగా ఉండేవారు. తరువాత వారు తమ సంపదను దానం చేసి తన పత్ని అయిన
ఆండాల్ అనే ఆవిడతో కలిసి శ్రీరంగంలో రామానుజులవారి గురించి విని వారి వద్ద
సంప్రదాయ సేవ చేసుకోవాల్ని వచ్చారు. రామానుజులవారితో ఉండి రామానుజుల
వారితో బ్రహ్మ సూత్ర భాష్యం రచింపజేసారు. రామానుజుల వారు కాశ్మీరదేశం
వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గ్రంథాలయంలో బ్రహ్మ సూత్రాలకు సంబంధించిన
గ్రంథాలను వారు రామానుజుల వారితో పాటు చదివి తిరిగి దక్షిణ దేశానికి వచ్చాక
రామానుజులవారు బ్రహ్మ సూత్ర భాష్యం రచించేప్పుడు ఎంతగానో సహకరించారు.
కూరేశమిశ్రులు అక్కడ చదివిన గ్రంథాలను ఏమాత్రం మరచి పోకుండా తిరిగి
చెప్పగలిగారు. రామానుజుల వారికి ఒక సారి ప్రాణోపాయ స్థితి వస్తే కాపాడిన
మహనీయులు కూరేశమిశ్రులు.
కూరే
శమిశ్రులు అందించిన ఒక్కోక్క సూక్తి ఎంత గొప్పవో ఒక శ్లోకంలో అందించారు మన ఆచార్యులు.
శ్రీవత్సచిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే |
యదుక్తయస్త్రయీ కణ్ఠే యాన్తి మంగలసూత్రతామ్ ||
వేదాన్ని శాస్త్రంగా భావించినప్పుడు వేదపురుషుడు అని
భావిస్తారు. అదే వేదం జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మ స్వరూపాన్ని జన్మింపజేస్తుంది
కనక మాతృ స్వరూపంలో భావిస్తారు. అప్పుడు వేద మాత అని చెబుతారు. తండ్రికి
ఉండే హిత దృష్టి, తల్లికి ఉండే ప్రియ దృష్టి రెండూ వేదంలో మనం చూడొచ్చు.
అట్లాంటి వేదమాతకి శ్రీవత్స చిన్హమిశ్రులవారి సూక్తులు ఆమెకు మంగలసూత్రంలాగ
విరసిల్లుతూ ఉంటాయి కనుక వారి గొప్పతనాన్ని నోరారా చెప్పి
వారికి
నమస్కరించాలి అని వారిని స్థుతించే శ్లోకం తెలుపుతుంది. ఒక స్త్రీకి మంగల
సూత్రం అలంకృతమై ఉంటేనే పుణ్యస్త్రీగా భావిస్తారు, అది ఉంటేనే మిగతా ఎన్ని
ఆభరణాలు ఉన్నా శోభాయమానం. అట్లా వేదానికి వారి సూక్తులు అంత విశేషములు.
కూరేశమిశ్రులు రామానుజులవారిని ఉపద్రవం నుండి తప్పించడానికి
రామానుజులవారి త్రిదండం, కాశాయం ధరించి రామానుజుల వారిని నేనే అని చెప్పి
చోలరాజు సభకి వెళ్ళాడు. అక్కడ విషయం తెలుసుకున్న దుష్టరాజు వారి కళ్ళను
తీయించాలని శిక్ష వేసాడు. అందుకు అంత కష్టపడనవసరం లేదు అని, తానే తన కళ్ళను
పొడుచుకొని గురు భక్తిని చూపించారు. ఆతరువాత వారు మధురైకి ప్రక్కన ఉన్న
తిరుమాలిరుంజోలై అనే దివ్యదేశాన వేంచేసి పంచ స్తవం అనే ఐదు గ్రంథాలను
రచించారు.