గీతా జయంతి

పరమపావనమైన మార్గశీర్ష శుక్ల ఏకాదశి, ఈ రోజు భగవద్గీత లోకానికి అందిన రోజు. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహన ఎట్లా చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం. అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్దతకి సమాధానంగా భగవద్గీత ఈ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది, ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుంది. ఏ పని ఎట్లా చేయాలి, ఎంత వరకు చేయాలి అనే సంశయం కలిగిన వ్యక్తికి ఒక శ్రేయ సాధనంగా భగవద్గీత ఉపయోగపడుతుంది. నాకు కర్తవ్యం ఏమితే తెలియట్లేదు కానీ, "ఏ శ్రేయస్యం నిశ్చితం భూహితన్మే" నేను శ్రేయస్సుని కోరుకుంటున్నాను, నాకేది శ్రేయస్సో అది చెప్పు అని అర్జునుడు అడిగినది. శ్రేయస్సుని పొందాలి అనుకున్నవాడికే ఏమైనా చెప్పడం అవసరం, ఆ శ్రేయస్సు కోరే వ్యక్తి ఏ స్తాయిలో ఉన్నా అందరికి అందేలా శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఉపదేశమే భగవద్గీత.  అది వ్యక్తి గతంగా చిన్న స్థాయిలో కావచ్చు, యువ స్థాయిలో కావచ్చు, ఒక గృహస్తుగా జీవించే వ్యక్తి స్థాయిలో కావచ్చు, లేక వ్యాపారమో, వాణిజ్యమో, ఔద్యోగికమో ఏదో రకమైన శ్రేయస్సుని పొందాలి, అది అత్మోజ్జీవనకరమై ఉండాలి అనే వ్యక్తికి భగవంతుడు చేసిన అతి శక్తి వంతమైన ఉపదేశమే శ్రీమద్భగవద్గీత.
 
 
గాలి ఎంత సనాతనమో, జలం ఎంత సనాతనమో, ఆకాశం ఎంత సనాతనమో శ్రీమద్భగవద్గీత మానవ జాతికి నిత్య నూతనమై వెలుగొందే మహోపదేశం. ఈ నాడు భగవద్గీత లోకానికి అందిన రోజు. అయితే శ్రీకృష్ణుడు ఉపదేశం చేసింది యుధ్ధ ఆరంభంలో. యుధ్ధం ఆరంభం అయింది కార్తీక అమావాస్యనాడు. చాంద్రమానం ప్రకారం మరునాడు మార్గశీర్షం ప్రారంభం అయ్యింది. అమావాస్య నాడు అర్జునుడికి సంధిగ్దత ఏర్పడింది. యుధ్ధం చేయాలా మానాల అని. చేయాల్సినవి తగనివి అని అనిపించాయి, చేయకూడనివి తగినవి అని అనిపించాయి. అది చాలా ప్రమాధకరం. చేయాల్సినవి చేయకపోయినా ప్రమాధం లేదు, కానీ చేయకూడనివి చేస్తేనే ప్రమాధం. ఆ రకమైన పార్థుణ్ణి ఉద్దేశించి ఉపదేశం చేసాడు ఆనాడు. అర్జునుడికి కర్తవ్యం తెలిసింది, "కరిశ్యే వచనం తవా", నీవు చెప్పినట్లే చేస్తాను నా సంశయాలు అన్నీ తీరినవి అని చేతిలోంచి పారవేసిన ధనుర్భాణాలని మళ్ళీ తీసుకొని ఉపక్రమించాడు. పర్యవసానంగా శ్రీకృష్ణుడి ద్వారా విజయం లభించింది. ఉపదేశాన్ని అర్జునుడు మాత్రమే పొందాడు, ఆవేళా అక్కడ 18 అక్షోహణిల సైన్యం చేరి ఉంది. అంటే సుమారు నాలుగు లక్షలకు పైగా ఉంటే ఒక అక్షోహణి అంటారు. వారి తోపాటు గుఱ్ఱాలు, ఏనుగులు, రథాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో రకాల శబ్ధాల మధ్య శ్రీకృష్ణుడు చేసే ఉపదేశం అర్జునుడికి వినిపిస్తుందా ? నిజానికి వినిపించింది, ఎక్కడా కూడా కొంత వెసులుబాటు లేకుండా వినిపించింది. చివరి దాకా సాగింది. ఎట్లా సాగింది అనేది 1వ అధ్యాయంలో సంజయుడు భగవంతుని పేరు చెప్పడంలో వివరించాడు. భగవంతునికి పేరు హృషీకేశ, అంటే అన్ని ప్రాణుల ఇంద్రియాలని నియంత్రించే మహనీయుడు అని అర్థం. అక్కడ యుధ్ధరంగంలో అందరు, అన్ని ప్రాణులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. స్వామి చేసే ఉపదేశం అర్జునుడికి మాత్రమే వినిపిస్తుంది. ఆనాడు అర్జునుడికి మాత్రమే అందింది. యుధ్ధం ఆరంభం అయిన 11 వ నాడు భీష్మ పితామహుడు  అంపశయ్య మీద పడిపోవాల్సి వచ్చింది. ఈ సమాచారం దృతరాష్ట్రుడికి తెలిసింది. పాండవులు కౌరవులు భీష్మాచార్యున్ని ఎందుకు కొడతారు. కొడుతుంటే మిగతా వారు ఏం చేస్తున్నారు "కిమ కుర్వత" అంటూ సందేహం ప్రారంభం అయ్యింది. ఇది 11 వ నాడు అనిపించింది. అంతవరకు దృతరాష్ట్రుడికి అడగాలని అనిపించలేదు. వ్యాసుడు దివ్య దృష్టిని సంజయునికి ఇచ్చాడు, కానీ పుత్ర వ్యామోహం చేత తన పుత్రులే గెలుస్తారని అనుకున్నాడు. అప్పుడు సంజయుణ్ణి అడిగాడు, అప్పుడు సంజయుడు ఏఏ రోజు ఏఏ క్రమమంలో యుధ్ధం జరిగిందో చేప్పాడు. ఉపదేశం అమావాస్యనాడైనా లోకానికి తెలిసింది 11 వ నాడు. అందుకే మార్గశీర్ష ఏకాదశి నాడు గీతాజయంతి జరుపుకుంటాం.
 
 
మనకూ సంశయాలు తీరుతాయి, చేయాల్సిన కర్తవ్యం గుర్తితాం. చేసే తెలివి కలుగుతుంది. జీవితాన్ని సుఖమయం చేసుకుంటాం. ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి, అవి ఉపశమించాలి, అపన్నులైన వ్యక్తులను ఆదుకొనే హృదయ సౌకుమార్యం ఏర్పడాలి. మనం చెదరకుండా ఉండేందుకు మనో ధైర్యం ఏర్పడాలి. ఇవన్నీ కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.