ఆండాళ్ తిరునక్షత్రం

ఈ రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు, అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే, అందులో మునిగి, అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి, ఇంత ఉంది సుమా! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం.ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు, కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తోపాటు ఆయన శిష్యుడైన మధుర కవి, ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి, ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.
 
 
కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః