లోక రక్షణకై భగవంతుడు ఎంచుకున్న స్థానం "వేంకటాచలం"


భగవంతుని నామాల్ని తలిస్తే మన జన్మ పరంపరలో వస్తూండే పాపరాశిని పటాపంచలు చేస్తాయి. స్వామి నామానికుండే ప్రభావం అది. ఆయన పేరే వేంకటేశుడు కదా! కలియుగానికి నాయకుడై వచ్చాడు. కటములు అంటే పాపాలు. ఒకటి రెండు జన్మలవి కావు, కోటాను కోట్ల జన్మలుగా మన వెంట వస్తున్నాయి. అప్పు తీర్చక పోతే వడ్డీ మీద వడ్డీ పెరిగుతున్నట్లుగానే మన మీద పాపాలు పెరుగుతూ పోతాయి. వాటినే కటములు అంటారు. తమిళంలో కడాంగళ్ అని అంటారు. ఇలాంటివి మన మీద ఎన్నెన్ని ఉన్నాయో తెలియదు మనకి. అట్లాంటి వాటిని "వేం" కాల్చేసే శక్తి ఆ కోండకు ఉంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో శక్తి ఉంటుంది. సముద్రంలో అన్ని చోట్లా నత్తగుల్లలే దొరుకుతాయి, కొన్ని చోట్ల పగడాలు దొరుకుతాయి. కొన్ని చోట్ల ముత్యాలు దొరుకుతాయి. అట్లా భూమిపై ఈ కొండకు ఉన్న శక్తి వేరు.


మొదట మనకు ఈ భూమి యొక్క ప్రభావం ఏమిటో తెలియాలి. రామాయణంలో ఒక చిన్న సన్నివేశం గుర్తు చేసుకుందాం. హనుమ సీతమ్మను అశోక వనంలో, అమ్మా నిన్ను హింసిస్తున్న ఈ రాక్షస మూకను పట్టుబడతాను ఆజ్ఞ ఇవ్వవూ అని అడిగాడు. నాయనా హనుమా! తగదు ఈ మాట. ఈ భూమి మీద తప్పుచేయని వాడు ఎవడయ్యా. రాక్షస స్త్రీలు చేస్తున్నది తప్పు కాదు, వాళ్ళు రావణుడి సొమ్ము తింటున్నారు కనుక వాడు చెప్పినది చేస్తున్నారు. నన్ను హింసించడానికే వాళ్ళను పెట్టాడు. అది వారి బాధ్యత అనుకొని చేస్తున్నారు, అది వారి తప్పు కాదు అని చెప్పింది. అయినా తప్పు చేయని వాడెవడయ్యా ఈ భూమి మీద అని అడిగింది అమ్మ. అంటే నీవూ తప్పు చేసావా అని అడిగాడు హనుమ. నన్ను అడవికి రాకు కష్టపడతావని రాముడంటే నన్ను కాపాడ చేతగాని పిరికి వాడివా అని అన్నాను. పట్టించుకోలేదాయన. అడవికి వెళ్ళాక లక్ష్మణ స్వామిని నిందించాను, వెంటనే ఈ లంకలో పడాల్సి వచ్చింది. నేనూ తప్పు చేసాను అంది. అమ్మా! అయితే నేనూ తప్పు చేసానా అని హనుమ అడిగాడు. మరి చూసి రమ్మంటే నీవు చేసిందేమిటి అంది. నావిషయం ప్రక్కన పెట్టు, మా స్వామి రామ చంద్రుడు కూడా తప్పు చేసాడా అని అడిగాడు. అందుకు అమ్మ, అసలు ఆయన చేసినందుకే ఇంత ఉపద్రవం జరిగింది. సూర్పణక వచ్చింది అందంగా ఉన్నాడు అని కోరింది, నా ప్రక్కన భార్య ఉంది, నా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు అతణ్ణి అడుగు అని పరాచకం చేస్తేనే కదా ఇంత పని జరిగింది. ప్రకృతి ప్రభావం ఇక్కడ ఉన్న వాడిపై పడుతుందయ్యా అని చెప్పింది. భగవంతుడు ఈ మట్టి మీద అడుగుపెడదాం అనుకున్నప్పుడు, ఎక్కడ అడుగు పెడితే ఈ లోకాల్ని కాపాడగలనో అని ఆలోచన చేసి, ఏ కొండమీద అడుగు పెడితె ఈ లోకాన్ని తాను కరుణించగలుగుతాడో, ఆ కొండను తాను వెతుకున్నాడు. ఆ కోండకి పేరు వేంకటాచలము. అచలము అంటే కొండ, వేంకట అంటే పాపాలను కాల్చివేయ శక్తి కలది. కనుకనే ఆ కొండని తన స్థానంగా నిర్ణయం చేసుకొని ఆ కొండపై అడుగుపెట్టాడు. ఇప్పటినుండి కాదు ఎప్పటి నుండో. సృష్టి ఆరంభం నుండే.

సృష్టి ఆరంభం ఎప్పుడు జరిగింది అని ఈ నాటి వైజ్ఞానికులు సుమారు 200 కోట్ల సంవత్సరాలు అని చెబుతున్నారు. పంచాంగాల్లో 192 కోట్ల 58 లక్షల పైచిలుకు సంవత్సరాలు అని అంటారు. మనకు ఒక్క సంవత్సరం ముందుకు వెళ్తేనే తెలియదు, ఎన్ని కోట్లయినా సమానమే! 200 కోట్లు అనుకున్నా పెద్ద బెంగ లేదు. 200 కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడ్డ భూమి పై ప్రాణికోటి సాగడానికి తన అవసరం ఉంటుందని తెలుసుకొని వరాహ స్వరూపుడై వచ్చిన స్వామి ఆ వేంకటాచలాన్నే స్థానంగా చేసుకున్నాడు. అక్కడికి వచ్చేవారికి తనని చూడటానికి అవకాశం లేకపోయినా తీర్థాన్ని స్పృషించి తరించడానికి వీలుగా తన స్వామి పుష్కరిణిని తీసుకువచ్చాడు. ఆ స్వామి పుష్కరిణే తనను సూచించే గుర్తుగా పెట్టుకొని పశ్చిమాన వరాహ రూపుడై తాను ఉన్నాడు.  కొండపై శిలాతోరణం 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డని అని వైజ్ఞానికులు చెబుతున్నారు. అంటే కోట్ల సంవత్సరాల చరిత్ర ఇది. కాలంగడిచింది, కలియుగంలో మనలాంటి వారికోసం మీరు కోరుకుంటే మీ కంటికి కనిపించేటంత రూపంలో ఆయనే మరొక రూపంలో శ్రీశ్రీనివాసుడై అర్చామూర్తిగా తొండమాన్ చక్రవర్తికి కనిపించి ఆలయ నిర్మాణ చేయించుకొని ఈనాటికీ సాక్షాత్కరిస్తున్నాడు.


అంటే కలియుగంలోనే ఆయన రావడం ఆరంభంచేయలేదు, అంతకు ముందు ఎన్నో ఎన్నో యుగాలలో వాయుదేవుడు, పరమశివుడు, కుమారస్వామి, అగస్త్యాది మహర్షులు తపస్సుచేసి ప్రార్థిస్తే వారి వారి ప్రార్థనకి ఆయా సమయంలో స్వామి పుష్కరిణిలోంచే విమానంతో ఆవిర్భవించి వారికి దర్శనమిచ్చి వారి కోరికలు తీర్చి బ్రహ్మాదులచే ఉత్సవాలు జరిపించుకొని తిరిగి వెళ్ళిపోవడం  జరిగేది. కలియుగానికి ఆయన మన వద్ద ఎప్పటికీ ఉంటే తప్ప విశ్వాసం పొందలేం అని తొండమానుడికి విగ్రహంగా దర్శనమిచ్చి, అంతటితోనే కాదు అర్చానియమాన్ని ఉల్లంగించి అప్పుడప్పుడు భక్తులకు కనిపిస్తుంటా అని చెప్పి ఆలయనిర్మాణం చేయించుకున్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. అట్లా కనిపించాడా అంటే ఎన్నో సందర్భాలు మనకు పురాణాల్లో ఉన్నాయి, ఇప్పటి కాలంలో కూడా ఉన్నాయి.