తిరుమల నంబి నిష్ఠకు మెచ్చి బోయవానిగా వచ్చిన స్వామి


 
 ఏడు కొండలపై నిలిచిన వేంకటేశునికి కైంకర్య దీక్ష చేపట్టిన విద్వాంసుడు తిరుమల నంబి. కొండపై ఉన్న చలికి చెదిరేవారు కాదు ఆయన. అక్కడ ఉండే సర్పాలకు, కీటకాలకు, క్రూరమృగాలకు బెదరక ఉండేవారు ఆయన. స్వామి కీర్థనయే ఆహారం, స్వామి సేవయే ఊపిరిగా బ్రతికేవారు. పుష్ప ప్రియుడైన వేంకటేశునికి పూలమాలలు కట్టడం, స్వామి అభిషేకానికి పాపనాశనం నుండి నీరు తేవడం ఆయన నిత్య కైంకర్యంగా ఉండేది.
 
 
 
సంవత్సరకాలం కొండ దిగివచ్చి రామానుజుల వారికి శ్రీమద్రామయణమును చెప్పేవారు. అట్లా శ్రీమద్రామయణమును చెప్పిన అర్థం చెప్పక 18 సార్లు రహస్యములని చెప్పిన జ్ఞాని తిరుమల నంబి. ఒక నాడు ఏదో ఒక కారణంచే స్వామి సేవకు దూరమై భాదపడుచుండగా వారి అధ్యయన స్థలమందే ధివ్యపాద చిహ్నములను దర్శింపజేసాడు స్వామి.
 
 
 తిరుమల నంబి నిష్ఠను మెచ్చిన స్వామి ఒక సారి బోయరూపంలో ప్రకటితమయ్యాడు. ఒకనాడు పాపనాశనం నుండి ఎప్పటివలె నీరు తెస్తున్నాడు. స్వామి బోయవానిగా వచ్చి తిరుమల నంబిని అడ్డగించి నీరు అడిగాడు. ఇవి స్వామికోసం తెచ్చిన నీరు అని చెప్పి నిరాకరించి ముందుకు నడిచాడు. అలనాడు వెన్నదొంగయైన స్వామి గొల్ల భామల కుండలకు చేసిన సత్కారం తిరుమల నంబి కుండకు చేసి చిలిపివాడై ఆ కుండనుండి వచ్చే నీటిని త్రాగాడు. అది చూసి "మంద భాగ్యుడా ఎంత పని చేసితివి ? భాగవదపచారం తగునా" అని నిలదీసి అడిగే సరికి అక్కడే ఆకాశ గంగను సృష్టించి ఇదియే స్వామికి తగిన నీరని చెప్పి బోయ మాయమైనాడు. అంతే కాక అర్చకులను ఆవహించి ఆకాశగంగను తనకు ఉదకంగా ప్రకటించుకున్నాడు స్వామి.