పద్మావతి అమ్మవారి దేవాలయం, తిరుచానూరు


 
అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి, రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనేగుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఏమో పాపాలతో నిండి ఉన్నాం, మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కన బడొద్దు లేదా దోశాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు. లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడవల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాల్లం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి ఎంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసిందికాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు.
 
 
 

 
అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన  రాముడయితే అమే సీతగా వచ్చింది. ఆయన శ్రీనివాసునిగా వచ్చినప్పుడు ఆమె పద్మావతి దేవిగా అవతరించింది.  వెనక ఒక చిన్న చరిత్ర ఉంది. శ్రీమన్నారాయణుని దర్శనార్థం కార్య వైకుంఠానికి భృగు మహర్షి వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు భృగు మహర్షిని గమనించలేదని ఆగ్రహించాడు. ఆయన ఆగ్రహాన్ని అణిచివేయడానికి శ్రీమహావిష్ణువు ఆయన కాల్లు పట్టుకొని భృగుమహర్షి కాలిలో ఉన్న మూడో కన్నుని పీకేసాడు. ఇది చూసి భరించలేక పోయింది అమ్మ లక్ష్మీ దేవి. వెంటనే అక్కడినుండి వచ్చి పద్మ పుష్కరిణిలో ఉండిపోయింది. కొంతకాలం అయ్యాక ఆమె పద్మావతి దేవిగా ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించి ఆయన వద్ద పెరిగింది. ఆమెను వెతుకుతూ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై శేషాచలం చేరుకున్నాడు. ఆతర్వాత శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం ఆడటం జరిగింది.
 

 

      అలమేలుమంగ మూలవర్        అలమేలుమంగ ఉత్సవ మూర్తి

 
 
అట్లా వేంకటేశ్వర స్వామికి పురుషకారం అమ్మ పద్మావతి. ఆమెకే అలమేలుమంగ అని కూడా పేరు. అందుకే తిరుమల దర్శించే ముందే అమ్మవారిని దర్శించడం మన సంప్రదాయం. అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన భాదలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్థలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఖిఃస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఖం గా భావించటం. వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "ల" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం.