తిల్య గోవిందరాజ స్వామి ఆలయం


 
రామానుజులవారు వేంచేసి ఉన్న సమయంలో ఎక్కడ చూసినా వైష్ణవమే. ఈ విషయం చోళ రాజైన కూలత్తుంగచోళుడు జీర్ణించుకోలేక పోయాడు. రామానుజులవారికి ఉపద్రవం తలపెట్టడానికి తన సైన్యాన్ని శ్రీరంగానికి పంపాడు. అక్కడ రామానుజులవారు పుష్కరిణిలో స్నానం ఆచరిస్తున్నారు. వారిని తీసుకుపోవడానికి వచ్చారని గుర్తించిన రామానుజుల శిష్యుడైన  కూరేశులు రామానుజులవారి వలె వేశం ధరించి తానే రామానుజుడిని అని వారికి చిక్కి పోయాడు.  తన గురించి వారు గుర్తించేలోపు అనుచరులకు రామానుజులవారిని ఇక్కడి నుండి దూరంగా తీసుకువెళ్ళమని చెప్పాడు. కూలత్తుంగచోళుడికి విషయం తెలిసి కూరేశుల కళ్ళని తీసివేయాలని అదేశించాడు. అంత శ్రమ అవసరం లేదు అని కూరేశులు తమ కళ్ళ గుడ్లను తానే పీకి విసిరికొట్టాడు.  
 

   

గోవిందరాజ స్వామి

అంతటితో కూలత్తుంగచోళుడి మనస్సు శాంతించలేదు, చిదంబరంలోని తిరుచిత్రకూటం అనే ఆలయంలో ఉన్న గోవిందరాజుల విగ్రహాలను ద్వంసం చేయాలని తలపెట్టాడు. శ్రీరామచంద్రుడు సీతను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చి, ఆక్కడి ప్రదేశం చిత్రకూటం వలె ఉన్నది అని అనుకున్నాడట. అక్కడ వెలసిన గోవిందరాజులను ఆళ్వార్లు శ్రీరామచంద్రుడని భావించి మంగళాశాసనం చేసారు. అందుకే తిరుచిత్రకూటం అని పేరు. గోవిందరాజుల ఆలయానికి కూలత్తుంగచోళుడు తన భటులతో రాగానే అక్కడ తిల్య అనే నర్తకి నృత్యం చేస్తుంది. ఏ కూలత్తుంగచోళుడికి ఇష్టంలేని గోవిందరాజుల గానం మీదే ఆమె నృత్యం సాగుతుంది. అందరు ముగ్దులై ఆమె నాట్యాన్నే చూస్తున్నారు. అంతలో ఆమె స్పృహతప్పి పడిపోయింది, అందరూ ఆమె చుట్టు చేరారు. ఆమె మేల్కునే లోపు వెళ్ళి ఆలయంలోపల చూస్తే గోవిందరాజుల ఉత్సవమూర్తులు అక్కడి భక్త బృదం తప్పించింది. ఆకోపంతో గోవిందరాజుల ఆలయాన్ని నేల మట్టం చేయించాడు. అక్కడి భక్త బృందం రోదించింది. తిల్య చేసిన నేర్పరి తనానికి ఆమెను బంధించాడు. తనను బంధిస్తేనేం? గోవిందుడిని విడిపించాను అని తృప్తి పొందింది తిల్య. అంతటితో ఆగక వాడి కన్ను శ్రీరంగంపై పడింది. ఈ విషయం తెలిసిన వైష్ణవులు విలవిలలాడారు. రంగనాథా నీవే కాపాడాలి అని రోదించ సాగారు. అదేరోజు కూలత్తుంగచోళుడికి గొంతులో ఏదో ఒక భాద అనిపించి వైధ్యులని పిలిపించాడు. భరించలేని నొప్పి విశ్వరూపం దాల్చింది. గొంతుకి పుట్ట కురుపు లేచింది. అప్పుడు తాని కూరేశులకి చేసిన ఉపద్రవం గుర్తుకు వచ్చాయి. గొంతులోని పుండులోనుండి పురుగులు పడుతున్నాయని తెలియగానే, అయ్యో నేను క్రిమికంఠుడిని అయ్యానే అని విలపించసాగాడు. తిల్యని విడిపించి ఆమెను క్షమించమని ప్రార్థించాడు. విపరీతమైన భాదతో ప్రాణం వదిలాడు.
 
 
 
యదుగిరిలో వేంచేసిఉన్న రామానుజాచార్యుల వద్దకి తిరుపతి నుంది వైష్ణవ స్వాములు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి, గోవిందరాజుల ఉత్సవ మూర్తులని ప్రతిష్ఠించమని కోరారు. తిల్య అనే నర్తకీమణి తన అద్భుత నటనా కౌశలంతో ఈ ఉత్సవ మూర్తులను కాపాడింది అని చెప్పగానే రామానుజులవారు "తిల్య ఎంతటి భక్తురాలు! ఆమె ధన్యురాలు" అని చెప్పి రాయవేలు నుండి ఆ ఉత్సవ మూర్తులను తిరుపతికి తెప్పించి గోవిందరాజ స్వాముల ఆలయం ఏర్పాటు చేసారు రామానుజులవారు. తిల్య పేరు చిరస్థాయిగా నిలవాలని భగవంతుడి నామంతో ఆమె నామాన్ని చేర్చి ఆమెను అనుగ్రహించారు. అట్లా తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామికి తిల్య గోవిందరాజ స్వామి అని పేరు.