శ్రీనివాస అవతారం - పద్మావతితో కళ్యాణం


 
కలియుగం  ఆరంభం అయిన మొదటి వెయ్యి సంవత్సరాల కాలంలో శ్రీనివాసుడు అవతరించాడు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ అవతరించిన స్వామి ఎక్కడి వెళ్ళాడు అని పురాణాలు తెలుపుతూ హిమాలయాలకి దక్షిణాన తూర్పు సముద్రానికి పశ్చిమాన ఉండే కొండలమీద స్వామి అవతరించాడని తెలియజేస్తున్నాయి. అవతరించి కొండమీదికి చేరాడు అని తెలుస్తుంది. ఆకొండ వరాహస్వామికి చెందినది కనుక ఆయన వద్ద స్నేహం చేసుకొని కొంత స్థలాన్ని అడిగాడు. తాను తిరిగి ఇచ్చే ఋణంగా నావద్దకు వచ్చేవారిని మొదట నిన్ను చూసేట్టు ఏర్పాటుచేస్తాను, ప్రసాదం ముందు నీకు ఆరగింపుచేసాకే నేను స్వీకరిస్తా అని చెప్పాడు. అందుకు తన పుష్కరిణికి పశ్చిమాన ఉన్న స్థలాన్ని ఇచ్చాడు వరాహ స్వామి. ఇది వరాహ పురాణం వివరిస్తుంది. ఆ వచ్చినటువంటి శ్రీనివాడుకు శంఖనుడు అనే రాజుగారికి కనిపించి ఇక్కడ నేను ఏరూపంలో కనిపిస్తున్నానో అట్లాంటి మూర్తిని తయారుచేసి ఆలయాన్ని నిర్మాణం చేయి అని ఆదేశించాడు. అట్లా మూర్తిని నిర్మింపజేసాడు.
 
  
 
కొంతకాలం తరువాత తొండమాన్ చక్రవర్తి రావడం, ఆయనతో సఖ్యం ఎర్పడింది. తాను కోరుకున్న పద్మావతీ దేవి తొండమాన్ చక్రవర్తి అన్నగారైన ఆకాశరాజు కుమార్తెగా పెరుగుతుంది. ఆమె పద్మ సరోవరంలో అవతరించి ఆరాజు వద్ద పెరుగుతుంది. కృష్ణావతారంలో తన తల్లిగా ఉన్న యశోదమ్మను వకులాదేవిగా అవతరింపజేసి ఆమెద్వారా రాయబారం నడిపించి పద్మావతి దేవిని వివాహం ఆడటంజరిగింది.
 
 
 
పద్మావతి దేవిని వివాహం ఆడిన తదుపరి కాలం సుమారు ఆరు నెలల కాలంలో పద్మావతి దేవి తండ్రిగారు దేహయాత్ర చాలించడం జరిగింది. ఆమె తమ్ముడికి రాజ్యం కావాలి అని తన పిన తండ్రి అయిన తొండమాన్ చక్రవర్తిని అడిగాడు. ఆ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరూ శ్రీనివాసుడి వద్దకి వచ్చారు. తను ఒక పక్క తన ఆయుదాలను ఒక పక్క ఉంది ఏదో ఒకటి కోరుకోమన్నాడు శ్రీనివాసుడు. తొండమాన్ చక్రవర్తి తన ఆయుదాలను తీసుకున్నాడు, ఆ కుర్రవాడు శ్రీనివాసుడిని కోరుకున్నాడు. యుద్దం పెద్దగా జరగకుండా ఇద్దరూ పరస్పరం ఒక అంగీకారానికి వచ్చారు. శ్రీనివాడు ఇద్దరికి కొంత రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఉండే తిరుపతి మొదలుకొని శ్రీపెరంబుదూర్ వంటి ప్రాంతాలని తొండనాడు అని చెబుతారు. ఈనాటికి అట్లానే పిలుస్తుంటారు. అది తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు, మిగతా కొంత ఆ పద్మావతి దేవి తమ్ముడికి ఇచ్చాడు.
 
 
 
భగవంతుడు సహాయం చేస్తున్నాడు కదా అని తొండమానుడు దుర్వినియోగం చేయటం ప్రారంభించాడు.కూర్మద్వజుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్యా పిల్లల్ని తొండమానుడి అధీనంలో ఉంచి, వారిని జాగ్రత్తగా కాపాడమని కోరి తాను కాశీయాత్రకి వెళ్ళాడు. ఆయనకు మాట ఇచ్చాడు, కానీ వారికి సరియైన రక్షణ కలిపించలేకపోయాడు. ఆ బ్రాహ్మడు యాత్ర ముగించుకొని వచ్చేసరికి ఒక సంవత్సరకాలం తర్వాత వచ్చి అడిగాడు. తొండమానుడికి జ్ఞాపకం కూడా లేదు. వారి గురించి వెతికించగా ఆ బ్రహ్మణుడి భార్య, ఆమె గర్భవతి అయిఉండటంచే పుట్టిన పిల్లవాడు, ఇదివరకు ఉన్న ఇద్దరు పిల్లలు అంతా చనిపోయి ఉన్నారు. వారి అస్థికలు మాత్రం లభించాయి. తొండమానుడికి ఏం తోచలేదు, బ్రాహ్మణుడికి చెబుతే శపిస్తాడు అని భయపడ్డాడు. తోచక రాత్రికి రాత్రి తన కోట నుండి వెంకటేశ్వర ఆలయం వరకు ఉన్న స్వరంగం ద్వారా అక్కడికి వెళ్ళి శ్రీనివాసుడి తలుపు తట్టాడు. నావద్ద వారి యముకలే మిగిలాయి ఏంచేయను అని అడిగితే, తొండమానుడు చేసిన పరాక్కు స్వామికి కోపం తెప్పించింది. తన చనువుని దుర్వినియోగం చేసుకుంటున్నారు కనుక ఇకనుండి మనిషిగా మాటలాడే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. కేవలం విగ్రహ రూపంలోనే ఉంటాను. అన్ని గమనిస్తూ ఉంటా కానీ మాటలాడను అని చెప్పి ఆ యముకలని పుష్కరిణిలో ముంచితే వారు తిరిగి వస్తారు అని చెప్పాడు. యముకలను ముంచితే ఆ బ్రాహ్మణుడి భార్య పిల్లలు వచ్చారు, అందుకే కొండమీద ఉన్న పుష్కరిణికి అస్థిపుష్కరిణి అని పేరు. వెంకటేశుడు ఆనాటినుండి ఇతరులతో మాట్లాడే ప్రయత్నం మానుకున్నాడు. తొండమానుడే ప్రాకారాలు నిర్మింపజేసి ఆలయాన్ని నిర్వహించేవాడు. ఇది కలియుగం ఆరంభం అయిన మొదటి వెయ్యి సంవత్సరాలలోపు జరిగిన చరిత్ర.