రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం! అభివర్థతాం!!


 
శ్రీభాష్యకారుడై, విశిష్టాద్వైత సిద్దాంతాన్ని స్థిరముగ నిలిపిన ధీశాలి రామానుజులవారు. కలియుగంలో వేంకటేశుడే గతి అని చాటిన గురువు ఆయన. కొండను ఆదిశేషుడని భావింది మోకాలుతోటే కొండనెక్కిన భక్తి పరుడు. కేవలం మనకే కాక శంఖ చక్రా క్రియాది కార్యాలను స్వామికి చేసి ఆచార్యుడంటే ఇతనే అని అనిపించుకున్న వారు ఆయన. స్వామికి ఊర్ధ్వపుండ్రమును ధరింపజేసి లోకానికి ఆయన శోభను ప్రకశింపజేసాడు.
 
 
           
మూలవర్ వేంకటేశ్వర స్వామి                               ఉత్సవమూర్తి మలయప్ప
 
వేంకటేశ్వరుడిని లోకానికి ప్రకటింపజేసి అక్కడ ఆలయ నిర్వహనములని చక్కపరిచారు భగవత్ రామానుజులవారు. కొండపై పూలు స్వామికి తప్ప ఇతరులకు అర్హతలేదు అని నియమం ఏర్పాటు చేసారు. నీలకంఠుడిచే పూజింపబడ్డ నారసింహ మూర్తికి ఆరాధనా లోపం జరగ కూడదని శ్రీనివాసుని ధివ్య విమానమునకు అభిముఖంగా నారసింహ మూర్తిని ప్రతిష్ఠించారు. దేవాలయం చుట్టు తిన్నని మాడవీధులను నిర్మించి ఉత్సవములను కొండపై జరిగేట్టు చేసారు. అక్కడ నిత్యారాధనకు అర్చకులని ఏర్పాటు చేసారు. కొండపై మృతకళెబరములకు దహన సంస్కారం జరపరాదు అని నియమం ఏర్పరిచారు. మాడ వీధుల యందు పాదరక్షలు ధరింపరాదని నియమం ఏర్పరిచారు.

వరాహ మూర్తి

రామానుజులవారు తిరుమల నంబి వద్ద రోజు రామాయణం నేర్చుచుండగా కొండ క్రింద లక్ష్మణహనుమత్సుగ్రీవాంగద సహితముగా శీరామచంద్ర మూర్తి విగ్రహముగా స్వామి దర్శనమిచ్చాడు. ఆమూర్తికి సీతను జతచేసి ఆరాధన, కళ్యాణము నిత్యంగా జరిగేట్టు నియమం ఏర్పరిచారు. వరాహ మూర్తికి ఉత్సవ మూర్తిని ఏర్పరిచి విశేషోత్సవములు జరిగెట్టు నియమం ఏర్పరిచారు. శ్రీనివాసుడికి ఇష్టమైన దివ్య ప్రబంధ గానములని తోమాల సేవగా ఏర్పరిచారు. ఆలయానికి ఎదుట జీయరుకు నివాసం ఏర్పరిచి తానారాధించిన రామచంద్ర మూర్తులని ప్రతిష్ఠించి శఠకోపయతికి అప్పగించారు. తిరుమలలో  ఆచార విశేష వ్యవస్థల ధర్మ పరిరక్షణకు తగు వ్యక్తులను ధర్మరక్షకులుగా నియమించారు.
 

సర్వలోక హితకరమైన శ్రీమద్రామానుజాచార్యుని దివ్యాజ్ఞ సమస్త దేశములయందు, దిక్కులయందు, అన్ని కాలములయందు అప్రతిహతంగా వర్థిల్లుగాక.
 

  
రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం! అభివర్థతాం!!