మన ఆలయాల స్థితిని పునరుద్ధరించుకునే అవసరం ఈవేళ ఉంది


11వ శతాబ్దానికి కొంత ముందు కాలంలో తిరుమలలో కొంత శైథిల్యం ఏర్పడింది. వేల సంవత్సరాల చరిత్రలో అప్పుడప్పుడు శిథిలం జరగడం అనేది ప్రకృతి ధర్మం. దాన్ని తిరిగి అలాగే జాగ్రత్తగా పునర్నిర్మితం చేసేవాళ్ళు భక్త శిఖామణులు. ఏజాతుకైనా చరిత్ర అనేది ప్రధానం. ఏ జాతి చరిత్రహీనులం కావాలని అని కోరుకోదు. తమ చరిత్రను సంరక్షించుకోవాలని అనుకుంటారు. సుమారు నూరు నూటయాభై ఏండ్ల క్రితం ఏర్పడ్డ దేశాల వాళ్ళే తమ చరిత్రను పదిలంగా ఉంచుకుంటున్నారో గమనిస్తే తెలుస్తుంది. చరిత్ర చిహ్నాల్ని బద్రపరిస్తే జాతి చరిత్ర ప్రపంచంలో నిలుస్తుంది. వందలు కాదు వేలు కాదు ఈ మాన జాతి చరిత్ర కోట్ల సంవత్సరాలుగా వస్తున్నది అని చెప్పడానికి నిదర్శనాలుగా నిలబడ్డ స్థానాలు ఆలయాలు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆలయాలు కేవళం ప్రార్థనా స్థానాలు మాత్రమే కాదు. ఆరాధనతో పాటు జాతి చరిత్రను కాపాడే స్థానాలు. భగవంతుణ్ణి దర్శించుకోవడానికి మాత్రమే ఆలయాలు కావు. భగవంతుడు అణువణువునా నిండి ఉంటాడని వింటున్నాం. ప్రహ్లాదాది చరిత్రల్లో స్మరించాం. మనకు చూడటానికి ఒక విగ్రహ రూపంలో ఒక మూర్తిగా మన ఇంట్లో సాక్షాత్కరిస్తాడు. మన కోసం వచ్చిన రూపం కనుక మన అవసరాలకు తగ్గట్టుగా వస్తాడు. గాలి మనకు కావాలంటే దానికి తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. అట్లానే దైవం మన కోసం మన మాటలు వినడానికి చిన్ని రూపంలో వస్తాడు. అక్కడ మంత్రాలు కోరడు, మాటలే కోరుతాడు. సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి సమాజానికి కావల్సిన సంస్కారాన్ని అందించడానికి ఆలయాన్ని నిలయం చేసుకుంటాడు. అక్కడ మంత్రాలని శ్రవణం చేస్తాడు. ఆలయం అనేది సంస్కారానికి చరిత్రకి నిలయం. చెప్పాలంటే తీర్థం ప్రసాదం పుచ్చుకోవడానికి ఇల్లు చాలు. ఆలయం అనేది దైవదర్శనంతో పాటు సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తించేట్టు చేసేటటువంటి స్థానాలు ఆలయాలు. ఒక్కసారి గమనిస్తే ఇతర మతాల వారు వారి వారి ప్రార్థనా మందిరాల్లో క్రమశిక్షణగా ఉంటుంన్నారు, ఏది చేసినా దైవం పేరిట చేస్తారు. మనల్ని చూసి ఇతరులు నేర్చుకున్నారు. అది మనం ఈనాడు మరచిపోతున్నాం. ఆలయానికి వెళ్ళి మన గోత్ర నామాలతో చేస్తున్నాం ఎంత ఆశ్చర్యం చెప్పండి. మిగతావారు సమాజానికి తిండి పెట్టినా, బట్టాలు ఇచ్చినా దేవుడి పేరు పెట్టి చేస్తారు. మనమో దేవుడికి నేనే పెడుతున్నా అని నామ గోత్రాలు వ్రాసి చేసే అలవాటు చేసుకుంటున్నాం. ఎంత విపరీతమో గమనిస్తున్నామా ? ఎంత ఆశ్చర్యమో తెలుసునా ? దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇస్తున్నా అని అనడం చేతకాక నాది నేను నీకు ఇస్తున్నా అని అన్నాడు బలిచక్రవర్తి. "తుబ్యమహం సంప్రపదే నం మమః " అన్నాడు. ఇది నీది కాదయా నాది చూడవయా అని బలి తలని కొలిచాడు. ధర్మం చేయాలి కానీ దైవం పేరున చేయాలి. ఆ దైవం పేరు చెప్పి సమాజానికి చేయాలి. అహంకారాన్ని వదిలి దర్పాన్ని వదిలి దంభాన్ని వదిలి వినయంతో  చేయగలిగే స్థితిని మనకి ఆలయం నేర్పగలగాలి. అందుకే మన ఆలయాల స్థితిని పునరుద్ధరించుకునే అవసరం ఈవేళ ఉంది.

ఆశ్చర్యం ఏమిటంటే కనిపించే భగవంతునిపై నమ్మకం కలగడం లేదు. ఇంట్లో ఆలయంలో ఉన్న అర్చామూర్తిని మనం దేవుడిగా గుర్తించడం లేదు. విశ్వాసం తక్కువైపోయింది. దైవం ఎప్పూడూ మన చుట్టూ  ఉంది. ఒక్కో స్థానంలో జ్ఞానులైన మహానుభావులతో, మహానుభావుల ప్రేమతో మనలో ఉండే భక్తితో ఆ దైవం కరిగి మనలో ఉండే ఆంతరమైన శక్తిని పెంపొందిస్తుంది. ఎందుకని? అంటే మన చుట్టూ ఉండే సమాజంలో మనం సుఖంగా బ్రతకాలని. బ్రతుకును తృంచక్కరలేదు, త్యాగం చేయక్కర లేదు. "జిగీవిశేతుం శతగం సమాః" అని వేదాలు చెప్పాయి. ఒకటి కాదు వందల వందల ఏండ్లు బ్రతకాలని కోరుకొమ్మన్నాయి. ఇది ఉపనిషత్తు చేసిన ఉద్భోద. ప్రపంచమంతా బుడగ, మాయ, క్షణికం, ఇవాన్నీ తుచ్చము. దీన్ని వదిలి పెట్టాలి అనేది అంతా తప్పు. మనం అంతా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి, అందరం కలిసి బ్రతకాలి. మనం చెప్పే మాట కాదు వేదాలు చెప్పిన మాటలు. ఆ బ్రతికేటప్పుడు "కుర్వన్యేవా కర్మాణి" నీకు తగిన విధిని నిర్వర్తించుకొని బ్రతకాలి. మన చరిత్రను కాపాడుకోవడం మన విధి. దాన్ని కాపాడుకోవడం అనేది చరిత్రకు కేంద్రములైన స్థానాలని కాపాడుకోవాలని అర్థం. వెలుతురుని కాపాడుకోవాలంటే అర్థం దీపాన్ని కాపాడుకోవాలనే కదా. దీపం మసిపడితే నాకేం వెలుతురు నాకు కావాలి అంటే నీకు మిగిలేది చీకటే. మన చరిత్రకి దీపాలైన ఆలయాలని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎవరి బాధ్యత ? అది మన బాధ్యత. కలియుగానికి స్వామియై లోకానికి దీపమై ఉంటా అని ఏడుకొండల మీదికి స్వామి వచ్చాడు. అక్కడ చూసి మనం నేర్వాలి. ఇదివరకు రోజుల్లో ఆలయాలు విద్య, వైధ్యం మరియూ సేవకి స్థానంగా ఉండేవి. ఉత్తరదేశంలో ఇప్పటికి కూడా దైవ సన్నిధ్యంలో విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, పశుసంరక్షణ స్థానాలు ఉన్నాయి. దైవం అనేది ఆనాడూ ఈనాడు కనిపించేట్టు ఉంటుంది అని "సంభవామి యుగే యుగే" అని భగవద్గీత స్పష్టం చేస్తుంది. ఒకప్పుడు వచ్చిన రాముడు కృష్ణుడు ఇప్పుడు లేడెందుకు అని కొందరు అంటుంటారు, కానీ మన మందిరాల్లో ఉన్న అర్చామూర్తిని చూస్తూ కూడా మనకు నమ్మకం కుదరడం లేదు. ఇంట్లో ఉన్న దైవాన్ని నమ్మడం లేదు కనుకనే ఈ నాడు తిరుపతిలాంటి ఆలయాల్లో దేవునికి కనీసం నిదురించే సమయం కూడా ఇవ్వడం లేదు. కోరికలు అడగాలంటే అక్కడికే వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉన్న మూర్తిని అడగవచ్చు. మరి ఆలయాలు మనకు విధానాలని తెలిపేవి కావాలి. ఆలయాల వద్ద నేర్వాలి, ఇంట్లో అడగాలి. మార్కండేయ మహర్షికి స్వామి చెప్పిన సమాచారం ఉంది.  తొండమానుడికి స్వామిని చెప్పిన ఒక మాట ఉంది. నీకోసం నేను ఇక్కడ నిలబడుతా విగ్రహంగా, అంతేకాదు అవసరమైతే నీకు కదిలే రూపంలో కూడా కనబడుతా అని చెప్పాడు. విశ్వసించినవారికి చేస్తాడు. తిరుమలనంబి వృద్ధుడు ఎక్కడో పాపవినాశనం నుండి తీర్థాన్ని తెచ్చి స్వామి సేవకు అర్పిస్తుంటే, స్వామికి జాలి కలిగి బోయవాడి వేషంలో వచ్చి ఆకాశ గంగను తన తీర్థంగా స్వీకరిస్తా అని చెప్పినది ఏ పురాణాల కాలం కాదు, అది ఈ మధ్య కాలమే.

కొండమీది వ్యవస్థను 11 వ శతాబ్దంలో రామానుజులవారు క్రమబద్ధం చేసినప్పుడు అక్కడ ఒక జీయరును ఏర్పాటు చేసి, ఆ జీయరు స్వామితో నలుగురు ఏకాంగులని పెట్టి, ఆ జీయరు స్వామికి కొన్ని గుర్తులు ఇచ్చారు. హే జీయరు స్వామిన్! మీరు ఈ వేంకటేశ్వర స్వామికి సేవలు ఎట్లా చేయాలంటే రామ సేవ కోసం హనుమ ఎట్లా అయితే స్పందించాడో అట్లా చేయాలి. రామ సేవ కోసం హనుమ లంకకి వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళగలిగాడు. రావణ సభలో ఆతడి సైన్యం ముందర నిలబడి తోకకు చుట్టి నిన్ను రాముడి పాదాల వద్ద వేయగలను జాగ్రత్త అని చెప్పేంత సాహసంతో వెళ్ళాడు. దేవుడి సేవలో ఎట్లాంటి అపచారాలు జరగటానికి వీలు లేదు. అందుకే హనుమంతుడి జెండా, హనుమంతుడి ముద్రిక, హనుమంతుడి తాళం చెవి, హనుమంతుడి ఉంగరాన్ని ఇవన్నీ వారికి ఏర్పాటు చేయించి ఇచ్చారు. రామానుజులవారు ఇవన్నింటినీ హనుమంతుని సంబంధంతో ఏర్పాటు చేయించి ఇచ్చారు. హనుమంతుని సన్నిధికి ప్రక్కనే వారి మఠాన్ని కట్టించి,  రాముని వద్ద హనుమ ఎట్లా అయితే ఉన్నాడో ఈ వేంకటేశుడి వద్ద మీరూ అట్లా ఉండాలి అని జీయర్ స్వామికి తామారాదిచుకొనే రామచంద్రుణ్ణి జీయరుస్వామికి ఇచ్చారు రామానుజులవారు. ఇది చరిత్ర. దురదృష్టం ఏమిటంటే రామానుజులవారు ఏర్పాటుచేసిన మఠాన్ని కూడా తీసివేద్దాం అని అనుకున్నారు, అదృష్టం బాగుండి స్వామి అట్టే పెట్టుకున్నాడు. చరిత్రకి మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత ? ఇది కాకూడదు. రోమ్ లో ఒక చర్చిలో మా పన్నెండో శతాబ్ధపు గుర్తు అని ఒక గోడను అట్లే పెట్టుకున్నారు. మన మందిరాలని మన ఆచారాలని అగౌరవపరిచే స్థితిలో ఉన్నామే, తగదిది. చరిత్రని మనం పోనివ్వద్దు. వేంకటేశుడు మనకోసం ఈ నాటికీ ఎన్ని లీలలు ప్రదర్శించాడు. వెంగమాంబను కాదంటే తన ఇంటిముందరికి రథాన్ని వచ్చి ఆగిపోయేట్టు చేసాడే, ఇప్పటి చరిత్ర అది. అంతకు ముందు అన్నమాచార్యులకి ఎన్ని అనుగ్రహాలు అందించాడు స్వామి. అంతకు ముందు అనంతార్యుకి ఏమీ చేతకాని ఆవిడలా అమ్మ తోటలో దొరికిపోయి ఆయనచే కట్టించుకొని ఆయన చేతులు మీదిగా స్వామిని చేరి అనంతార్యులని స్వామికి మామగారు అయ్యేట్టు చేసిందే. ఇది మన మధ్య ఉండే చరిత్య. దీనికి గుర్తుగానే స్వామికి అప్రదక్షిణం బ్రహ్మోత్సవాల్లో ఒక ఉత్సవంగా తిలకిస్తున్నాం ఈనాటికీ. దేవుడు కనిపిస్తాడు, మాట్లాడుతాడు. మీరు పూజించుకునే విగ్రహంలోనూ ఉంటాడు. కానీ మనం ఎక్కడికో వెళ్తే మాత్రమే దేవుడు కాదు, ముందు మీ ఇంట్లో దేవుణ్ణి విశ్వసించండి. అప్పుడు ఆలయాల్లో దేవుణ్ణి చూసి స్పూర్తి పొందండి.