క్షేత్ర ద్రష్ట రామానుజాచార్యుల ద్వారా వేంకటేశ్వరునిగా లోకానికి ప్రకటన


 
ఒక్కో స్థానంలో ఒక్కో రకంగా భగవంతుడిని సందర్శించి, ఆసందర్శనలో భగవంతుడిని వశపరచుకొని 'హే భగవన్! నీవు ఇక్కడే ఇట్లానే ఉండి ఎవరెవ్వరు నిన్ను చూడటానికి వస్తారో వాల్లకి సాక్షాత్కరించవయ్యా అని చెబుతారు, వారు చెప్పారుకదా అని భగవంతుడు అక్కడ ఉంటాడు. వేంకటేశ్వరుడు తిరుమల కొండపై వేంచేసి ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన అక్కడ, ఎప్పుడు వచ్చి ఉన్నాడాయన ? ఎప్పటినుండో ఉన్నాడాయన. కానీ మొదటి నుండి ఆ ఆకృతిలో లేడు, చాలా కాలంగా ఆయన ఎవరి ఆరాధన పొందేవాడే కాదు. కలియుగ ఆదిలో దివ్యసూరులు ఆయన గూర్చి పాడారు, తరువాత కాలంలో ఆయన ఏమైయ్యాడో తెలియదు.
 

పదకొండవ శతాబ్దంలో రామానుజులవారు తిరుమల వెళ్ళి స్వామిని సేవించారు. ఇప్పుడు చూస్తున్నట్టు ఎంలేదు అక్కడ, కారడవి, ఎటు చూసిన దొంగలు, పులులు మొదలైన జంతువులు ఉండేవి. కేవలం నడక మార్గమే ఉండేది. ఆభరణాలు లేవు, ఆయుధాలు లేవు. అక్కడ స్వామి అనాదరంగా పడి ఉంటే చూసి స్వామిని మనస్సున సాక్షాత్కరించుకొని ఆయన వేంకటేశుడని తెలుసుకొని, మా కోసం ఇక్కడికి వచ్చి ఉన్నావా! కనీసం నీస్వరూపం కూడా గుర్తించక ఇక్కడ  పడి ఉన్నావా అని స్మరించాడు మనస్సున. ఆనాడు అక్కడ పరిపాలించే ప్రభువులని మెప్పించి ఒప్పించి, ఇతను కేవలం లోకాన్ని ఉద్దరించడానికి వచ్చిన శ్రీపతి సుమా! అని చెప్పాడు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, మరి శ్రీపతి అని నిరూపించగలరా అని రామానుజుల వారిని అడిగాడట. నేను నిరూపించడం ఏమిటండీ, ఎందరో గతంలో చెప్పారు, ఇది కొత్త విషయం కాదు. మనకోసమని ఈ లోకానికి వచ్చి నిలచి ఉన్నాడు కొండల మీద అని మన ఆళ్వారులు పాడారు. కనుక కొండల మీద నిలిచినది ఇతడే. "కుడ్రమేంది కులిర్ మరై కార్థవన్ అన్ న్యాలం అళంద పిరాన్ పరం శెన్ఱు శేర్ తిరువేంగడ వామలై" అని అంటారు. పరాత్పరుడైనటువంటి వేంకటా చలపతి వచ్చి వేంచేసి ఉన్నాడిక్కడ అని ఆళ్వారులు పాడారు. మరి అట్లాంటి స్వామి ఇక్కడ ఉంటుంటే మరి ఆయనకి సరియైన స్వరూపాన్ని కల్గించడం, ఆరాధనా పద్దతిని ఏర్పాటు చెయ్యడం మన స్వరూపం అని రామానుజుల వారు అక్కడి ప్రభువుతో చెప్పారట.  మరి ఆయనే ఈయన అని నిరూపించమని అడిగారట ఆ ప్రభువు. మరి నిరూపిచాలి అంటే రక రకాల ఆయుధాలని, ఆభరణాలని పెట్టండి, రాత్రి స్వామిని పవళింప జేయండి రాత్రి ఆయన దేన్ని ధరిస్తే దాన్ని బట్టి చెప్పండి అని రామానుజులవారు చెప్పారు.  రక రకాల ఆయుధాలని, ఆభరణాలని పెట్టారు, మరునాడు తలుపు తీసి చూసే సరికి ఆయన శంఖ చక్రములని దాల్చి ఉన్నాడు. ఆవేళ అట్లా నిరూపించబడింది. అందుకే మనం వేంకటేశ్వర ఆళయాల్లో చూస్తున్నట్టు, తిరుమలలో  స్వామికి శంఖ చక్రాదులు విగ్రహంలోనే తయారు చేసి ఉండవు. అవి చేర్చి ఉంటాయి. ఎందుకు చేర్చి ఉన్నాయి అంటే ఆనాడు స్వామి స్వీకరించాడు కాబట్టి. సహజంగా తనతో వచ్చిన ఆయుధాలని ఎవరో దుండగులు చేసిన పనికి కోల్పోయి ఉంటాడు. ఎప్పుడైనా వేంకటేశునికి ఏదో ఉపద్రవం వాటిల్లి ఉందేమో ఆయుదాలు కొట్టి వేయబడి ఉన్నాయి, మనకు చరిత్ర మనకు అంత తెలియదు. అలా ఎన్నో రోజులు ఉన్నాడు ఆయన, కానీ రామానుజులవారు కనిపెట్టాక, ఆనాడు ఆయన శంఖ చక్రాలు ధరిస్తే, ఓ ఈయన శంఖ చక్రధారి అయిన లక్ష్మీనాథుడు సుమా! అని లోకం గుర్తించేట్టు ఆయన స్వరూపాన్ని లోకానికి ప్రకటించాడు.

 
 
ఆయన స్వరూపాన్ని నిలబడేట్టు ఉపనిషత్ సారమైన వేదార్థసంగ్రహం అని ఒక గ్రంథాన్ని భగవత్ రామానుజుల వారు వేంకటేశ్వరుడికి ఉపదేశం చేసి, 'హే వేంకటేశా!  ఎవరెవరు వస్తారో వారి వారికి నీ స్వరూపాన్ని నీవు దర్శింపజేయాలి అని ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థనని కాదనలేక ఈనాటికీ ఆయన వేంకటేశునిగా సాక్షాత్కరిస్తున్నాడు మనకోసం. అంతకు ముందూ ఆయన ఉన్నాడు కాని ఆ పేరుతో ఆ రూపుతో లేడు. కానీ భగవంతుడు స్వతంత్రుడు, ఆయన మరిచి పోవచ్చుకూడా. ఆయన మరచి పోకుండా రామానుజుల వారు అక్కడే ఉంటారు. అందుకే తిరుమల ఆళయంలో హుండీ వద్ద ఎత్తైన స్థానంలో జ్ఞాన ముద్రతో రామానుజులవారు ఉంటారు. అందుకే శ్రీవేంకటేశుడు రామానుజుల వారికి శిష్యుడు అంటారు. వేదార్థసంగ్రహాన్ని విని రామానుజుల వారు చెప్పిన క్రమంలో వచ్చిన భక్తులకి కావల్సిన వరములని ప్రసాదిస్తున్నాడు.