కోరిన వరములిచ్చే కోనేటిరాయుడతడు


 
 
శ్రీవేంకటేశుని లీలా విషేష భరిత కథా వృత్తాంతం విన్నా, స్మరించినా సంసార భాధలను తొలగించే దివ్యామృతం. ఆయన గురించి మాట్లాడడం అంటే నరకాన్ని దూరం చేసుకోవడమనే కదా అర్థం.
 
  

 
ఒక పిల్లవాడు తన ఆహారం కోసం తల్లి స్తన్యాన్ని గుర్తించినట్లే పరమ భక్తులు భగవంతుడి పాదాలను తన ఆహారం అని గుర్తిస్తారు. ఆయన పాద మహిమ ఎంత అని కొనియాడగలం. ఆయన పాదాలని కడిగి బ్రహ్మ ధన్యుడాయె. ఆయన పాదములని తాకిన గంగ పరమ పునీతమయ్యింది. ఆగంగను తన శిరస్సున దాల్చిన శివుడు ఆరాధ్యుడయ్యాడు. ఆయన పాద స్పర్శవల్లే కదా అహల్య పురర్జన్మను పొందింది. వీరందరితో మనకు సామ్యం లేకున్నా స్వామి పాద స్పర్శను కోరి మన తలపై ఆయన పాద ముద్రల అనుగ్రహం పొందితే చాలు తరించిపోతాం.
 
               
 

దేవతలవంటి గొప్పవారికి మాత్రమే లభించే వాడైతే ఆయన గొప్పతనమేమి, నాలాంటి అతి సామాన్యులను, క్షుద్రులను తరింపజేస్తున్నావని ఆళ్వారులు పలికిన మాటలని ఎన్నో సార్లు నిజం చేసి చూపాడు స్వామి. బావాజీ అనే భక్తుడిని "ఓయీ! నీవు వేంకటేశుని ప్రియ భక్తునివా, అయితే ఈ బండెడు చెఱుకు తిని నిరూపించు" అని గేలిచినందుకు గజేంద్రుడవై వచ్చి వారికి బుధ్ధి చెప్పాడు స్వామి.  "విధవరాలవు నీవు, ఈ కోవెలలో హారతి పట్టుటకి తగవు" అని వేంగమాంబ అనే ప్రియ భక్తురాలిని ఆలయం నుండి బయటికి తరుమగా, మాడవీధులయందు ఊరేగే దివ్య రథం వేంగమాంబ ఇంటి ముంగిట కదలక నిలిపి భక్తురాలిని ఈసడించిన వారి తప్పు తెలుసుకొనేట్టు చేసాడు తిరుమలేశుడు. అలనాడు తొండమానుడు అహంకారంతో బంగారు తులసిని పూజకు సమర్పిస్తే అది కాదని ఒక కుమ్మరి తెచ్చిన మట్టి తులసిని స్వీకరించి తన సులభత్వాన్ని లోకానికి చాటాడు శీనివాసుడు. ఇలా బ్రహ్మ నుండి కుమ్మరి వరకు ఆయన అనుగ్రహం పొందినవారే!
 

కోరిన వరములనెల్ల కూరిమిగా సమకూర్చు భక్త వరదుడు. ఆశ్రిత వత్సలుడు. సర్వ జీవులకు శ్రీనివాసుడే ఆధారం. మనం అందరం ఆయన సొత్తు. ఆయనకు విధేయులమై సకల జీవులకు సేవ చేయడమే మన విధి. అట్లా ఆయన అనుగ్రహం మనపై ఉండాలి అని కోరాలి. ఆయనని ఏమి కోరాలో కూడా తెలియని వారిమి మనం. ఆరని విషయ భోగములను కోరి ఎన్నియో జన్మలు దగ్దం చేసుకుంటున్నాం. శ్రీనివాసుడి ఉనికిని తెలుపుతూ, ఆయన ప్రేమను పంచునట్టి వారిగా మనల్ని తీర్చి దిద్దమని కోరాలి.
 
 

ఓం నమో వేంకటేశాయ
 

తిరుమల తిరుపతి