కొండ సంబంధం వల్లే ఆయన 'వేంకటేశుడు'


 
శ్రీనివాసుడు వేంచేసి ఉన్న ఏడు కొండల మహత్యాన్ని బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం ఇలా ఒకటా రెండా పదకొండు పురాణాలు పదివేల ఏడువందల డెభ్భై ఒక్క శ్లోకాలతో గానం చేసాయి. శ్రీనివాసుడి సేవకై కొండపై ఉన్న మొక్కలు, పూలు, పండ్లు తమను తాము సిద్దం చేసుకుంటాయి. ఆయన పాద అభిషేకం కోసం, ఆయన భక్తులను తరింపజేయడానికి ఎన్నో పుణ్య తీర్థాలు, ప్రవాహాలు కొండపై నిలిచి ఉన్నాయి.

 
 
ఆయనవలె మనల్ని తరింపజేయగల మహత్తు ఆకొండ కూడా ఉన్నది అని పరమ భక్తులైన ఆళ్వార్లు కొండను తొక్కడమే అపచారం అని భావించి క్రింది నుండే మంగళాశాసనం చేసారు. కొండపై పక్షివలె కానీ చేప వలె కానీ పుట్టినా చాలు. సంపంగి చెట్టుగానైనా లేక ముళ్ళమొక్కగా నైనా పుట్టి కొండపై నిలిస్తే చాలు. లేక వాగుగా నైనా, ఒక బండగా నైనా కొండపై పడి ఉంటే చాలు. నలుగురు భక్తులు నడిచే దారిగనైనా ఉంటే చాలు. చివరికి 'పడియాకిడందు ఉన్ పవళవాయ్ కాట్నేనే' నీముందు తలుపు యొక్క గడపగా నైనా పడి ఉండి నిన్ను సేవించే భాగ్యం కలిగించు అని ఆళ్వార్లు పాడారు.

 
శ్రీనివాసుడు దేవతలకే ప్రభువైన వాడు. అంటే అంతటి వాడు మనకోసం ఎంచేస్తాడు అని అనుకో కూండా ఆయన అతి సామాన్యులకూ అందేవాడు. అందుకే ఆళ్వార్లు 'నీశనేన్ నిరె ఉన్నిమిలేన్ ఎణ్ కన్ పాశం బైత్త పరం శుడర్ సొదికే ఈశన్ అనవర్కు ఎన్బన్ ఎన్నాల్ అదుద్దేశమో తిరువేంగడతానక్కు ' అని అంటారు. ఈశన్ అనవర్కు- దేవతలకందరికి ప్రభువట,ఎన్బన్ ఎన్నాల్ అదుద్దేశమో- అది అంత గొప్ప విషయం కానే కాదు. మరి ఏమిటి గొప్ప ? నీశనేన్ నిరె ఉన్నిమిలేన్ - అతి క్షుద్రుడిని, అతి అల్పుడిని, అన్ని దోశాలు కల్గి ఏ ఇతర యోగ్యతా లేనటువంటి నాలాంటి అల్పుడిమీద కూడా నీ యొక్క కృపతో నన్ను ఉద్దరిస్తున్నావంటే అదే గొప్ప కదా తిరువేంగడతానక్కు- తిరువేంకటేశా!. వేంకటేశుడు అని ఆయన పేరు.  ఆళ్వార్లు దర్శించిన రోజుల్లో తిరువేంకటాచలపతి అడవులలో తానుండటం చేత  దొంగలకి, కోతులకి, కొండముచ్చులకి తన రూపాన్ని ప్రసాదిస్తూ ఆరాధనలందుకుంటూ ఉంటాడు అని ఆయన గొప్ప తనాన్ని పాడారు. అతి సామాన్యులతో చేరి పైకి ఉద్దరించగలవు అంటే అది గొప్ప. అట్లా ఆళ్వార్లు పాడారు కనక ఆయన వేంకటేశుడై నిలిచి ఉన్నాడు.

 
ఎందుకు ఆయన వేంకటేశుడు ?

వేంకటమన్నది పర్వతం పేరు. ఆపర్వతంపై ఎవరు ఉంటారో ఆయనకి పేరు వేంకటాచలపతి అని. అట్లా ఆ పర్వతం సంబంధం వల్లే ఆయనకి వేంకటేశుడు అని పేరు. ఈశ్వరుడు అంటే నియమించు వాడు అని అర్థం. దేనిని నియమించు వాడు? అంటే వేంకటమును నియమించువాడు అని అర్థం. వేంకటము అంటే ఏమి ?  ఈ వెంకటేశ్వర అనే పదం ద్రవిడం మరియూ సంస్కృతం రెంటిలోంచి ఏర్పడింది. దీని అర్థం మనకు నమ్మాళ్వారు వివరించారు. 'వేంకడంగల్ మేయ్ మేల్ వినై ఉత్తమన్ తాంగల్ తంగర్కు నల్లనవే శేవాయ్ వేంగడ తురై వార్కు నమో వెన్నలాంకడమై అదిసుమందా అరర్కే' అని అంటారు. 'కటంగల్' అంటే ఋణములవలే మనం అనుభవిస్తే తప్ప తొలగని పాపములకి పేరు.
 

ఋణం అంటే ఏమి? మనం పుట్టగానే కొన్ని ఋణములతో పుట్టాం. మనం పుట్టుకతో స్వతంత్రులం కాదు. మనం కొన్ని బంధాలతో పుడుతున్నాం. ఎందరితోనో బంధులుగా కల్గి ఉన్నాం. ఈ బంధాలన్నీ మనం తెచ్చుకుంటే రాలేదు, వాటంతట అవి ఏర్పడ్డాయి. చివరికి భార్యా భర్తల బంధం కూడా భగవంతుడు ఏర్పరిచిందే అని అంటుంటారు. అందుకే పుట్టుకతో వచ్చిన ఈ బంధాలని తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పారు మన పెద్దలు. మన భాద్యత ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. వీటిని ముఖ్యంగా మూడు భాగాలు చేసారు. ఆ మూడు రకాల ఋణాలని మనం  క్రమ క్రమంగా తీర్చివేవాలి అని చెబుతారు. మన స్మృతులలో మను అనే మహర్షి చెబుతాడు 'ఋణాని త్రీని అపా కృత్య మనో బ్రహ్మని నివేస్యచ' మూడు ఋణాలు తీసివేసుకొని, మనస్సును భగవంతుడిపై పెట్టాలి అప్పుడు మానవుడిగా తరించవచ్చు అని దీని అర్థం. మరి ఏమిటా ఋణాలు.
 

ఒకటి పిత్రు ఋణం. మనల్ని కన్న తల్లి తండ్రుల కోసం చెయ్యాల్సింది. రెండవది దేవ ఋణం. మనం బ్రతక గల్గుతున్నాం అంటే మనకు గాలి, నీరు , నేల ఇలా ఎన్నో దేవతలు సహాయం చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇలా అన్నో కోట్ల దేవతలు ఉన్నారు అంటారు, అందుకే అన్నింటి మూలమైన శ్రీకృష్ణా పరమాత్మని ఆరాధన చేస్తే అందరికీ చేసినట్లే, అలా దేవ ఋణం తీరుతుంది. మూడవది ఋషీ ఋణం. పశువుల వలె కాకుండా మనకు ఒక క్రమశిక్షణాయుత సమాజాన్ని మన చుట్టూ ఏర్పరిచినది ఋషులు. వారికి కొంత చేయ్యడం ఋషీ ఋణం తీర్చు కోవడం వంటిది. ఈ మూడింటిని మనం తీర్చుకోకుంటే అవి మనల్ని దిగజారేట్లు చేస్తాయి అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ఋణాలు అట్లా అయితే తీర్చుకుంటే కానీ తీరవో మనపై ఉండే పాపాలు అనుభవిస్తే కాని తొలగవు. అన్నీ అనుభవించి తొలగించుకోవాలి అనుకున్నా మనం అంత కాలం బ్రతకలేం. మరి ఈ పాపాలు ఎట్లా తొలగాలి ? ఇవన్నీ తొలగితే మనం మంచి స్థితిని పోందవచ్చు. మరి ఇప్పుడే తొలగించుకోవాలి అంటే ఎట్లా? దానికి సాధనం ఒకటి కావాలి.
 

మన మనస్సుకు పట్టిన ఈ పాపాలు అనే మళినాలను తొలగించే సాధనం నేను చెబుతాను రండి అని నమ్మాళ్వార్ అన్నారు. అదిగో కొండపై కూర్చున్నాడే ఆయనను 'వేంగడ తురైవార్కు నమః' అంటే వేంకటేశాయనమః అని అనమన్నాడు. ఎందుకాపేరు అంటే, ద్రవిడంలో  'కటంగల్' అంటే ఋణములన్నింటినీ 'వేం' కాల్చివేయును అని అర్థం. అలా మనపై ఉండే పాపాలని కాల్చివేయడాన్ని 'వేంకట' అని అంటారు. మరి కాల్చటం అంటే నిప్పు కూడా కాల్చగలదు కదా! కానీ అది కొంత మేరకే కాల్చగలదు. నిప్పుచే కూడా కాల్చబడని వాటిని కూడా కాల్చేవాడు పరమాత్మ కాబట్టి ఆయన కాల్చువాటి కన్నింటికీ నియంత. నియంత అంటే 'ఈశ్వర' అని అంటారు. అందుకే ఆయన పేరు 'వేంకటేశ్వర'.
 

అందుకే ఈ ఋణాలను కాల్చడంలో తనని మించినవారు లేరు కాబట్టి ఆయన పేరు వెంకటేశ్వర అయ్యింది. అలా పరమాత్మ వేంకటేశునిగా ఉన్నాడంటే కారణం ఏమి ? ఆనాడు నమ్మాళ్వార్ పాడారు కాబట్టి భగవంతుడు అక్కడ నిలిచాడు. భక్తుల ఆదేశానికి కట్టుబడి పరమాత్మ అక్కడ ఉంటాడు. కేవలం ఇక్కడే కాదు, నైమిశారణ్యంలో, భద్రికాశ్రమం లో 'హే భగవన్! నీవు ఇక్కడ ఇలా ఉండు'అని వేద వ్యాసుడు చెబితే అక్కడ స్వామి నిలిచాడు. కొన్ని దక్షిణ భారత దేశ దేవాలయాల్లో ఋషులు ప్రార్థన చేస్తే ఉన్నాడని, కొన్ని చోట్ల బ్రహ్మ ప్రార్థన చేస్తే ఉన్నాడని చెబుతుంటారు.