అనంతార్యునికి అల్లుడైన వేంకటేశుడు


 
వేంకటేశునికి పుష్ప కైకర్యం చెయ్యడానికి రామానుజులవారు తన శిష్యులని అడిగాడట. ఆకాలంలో అది ఒక అడివే. ఎవరు సాహసించేవారు కాదట. అందులోంచి ఒక శిష్యుడు నేను చేస్తాను అన్నాడట. అందుకు సంతోషించి రామానుజుల వారు ఆయనని నీవు మగాడివి అంటే 'ఆన్ పిళ్ళై' అని సత్కరించాడట. అనంతమైన స్వామి సేవకై ఉన్నారు కాబట్టి ఆ శిష్యుడి వంశానికి 'అనంతాన్ పిళ్ళై' అని పేరు.


అలనాడు లక్ష్మీ దేవిని వెతుకుతూ ఏడుకొండలు చేరి పుట్టలో నిలిచిన స్వామికి ఆకలి తీర్చాలని భావించి  బ్రహ్మ శివులు ఇద్దరు ఆవు దుడలుగా మారి అక్కడే రాజుకు అమ్ముడుబోయి నిత్యం పాల ధారలను అందించారు. దక్కవలసిన పాలు పుట్టపాలు అవుతున్నాయని అదిలించజూసిన గొల్లవాడు శ్రీనివాసుడిని గాయపరచాడు. చేసిన అపచారానికి హడలి ప్రాణాలు విడిచిన ఆ గొల్ల యొక్క సంతతివారికి ఈనాటికీ తొలిదర్శన భాగ్యం అనుగ్రహించాడు. శ్రీనివాసుడిని గాయ పరచి అభిమానం పొందిన గొల్లవానికి తోడుగా అనంతార్యులు అర్చా మూర్తియైన వేంకటేశుని ద్వారా అట్లాంటి అభిమానమే పొందాడు.

 
ఒకనాడు అనంతార్యుడు తన భార్య గర్భవతిగా ఉండి కూడా, ఇద్దరు కల్సి తోట పని నిమిత్తమై చెఱువు త్రవ్వుతున్నారు. అందుకు వేంకటేశుడే చూడలేక అయ్యయ్యో అనుకొని, ఒక చిన్న బాలుడి రూపంలో సహాయం చేయటానికి వచ్చాడట. తను వేంకటేశునికి చేసే సేవలో ఈ కొత్త కుర్రాడు వచ్చి దొంగిలిస్తున్నాడు అనుకొని, ఆ పిల్లవాడిని అదిరిస్తే ఆపిల్లవాడికి దెబ్బ తలిగిందట. ఆ పిల్లవాడు వేంకటేశుడే కావున, ఆ దెబ్బకి ఉపశమనంగా ఈనాటికి వెంకటేశుని గడ్డం క్రింద పచ్చ కర్పూరం పెడుతుంటారు అని వెంకటేశ్వర ఇతిహాసమాలలో తెలియజేస్తుంటారు.

 

అనంతార్యులు రామానుజుల పేర పూలవనమును భక్తితో పెంచాడు.ఆలయానికి ప్రక్కనే అనంతాన్ పిళ్ళై తోట ఉండేది. అక్కడే పెద్ద పుష్ప వాటికను పెంచి స్వామికి పుష్పాలని అర్పిస్తుండేవారు. ఒకనాడు మధ్యాహ్నపు వేళ వేంకటేశుడి నుండి పిలుపు వస్తే కూడా వెళ్ళలేదట. నేను ఉదయాన్నే మాల సమర్పించేసాను, నా గురువు చెప్పిన పని చేయడమే కర్తవ్యం, రేపటికి చేయాల్సిన పుష్ప కైంకర్యం లో నిమజ్ఞమై పోయాడట. ఆచార్యుల వారి మాట అంటే అంత గౌరవం ఉండేది వారికి. కొండపై పుష్పం శ్రీనివాసుడికి తప్ప అన్యులకు భోగం కాకూడదు అని తోటను కాచేవాడు. ఆయన పట్టుదలను ఒక సారి రుచిచూసిన తృప్తి చెందక అమ్మ పద్మావతితో కలిసి శ్రీనివాసుడు విహరించాడు. వారిని పట్టబోగా స్వామి మాయవియై తప్పించుకున్నాడు కానీ అమ్మ దొరికి పోయింది. పద్మావతి దేవిని చెట్టుకు కట్టి నీ పతి ఎక్కడ అని ప్రశ్నించగా క్రింద అలమేలుమంగాపురం నుంది అర్చకులు నీవు పట్టినది అమ్మవారిని అని అర్చకులు సందేశం పంపారు. అప్పుడు అమ్మవారిని పూలబుట్టలో కూర్చుండబెట్టి స్వామికి సమర్పించి కన్యాదాన ఫలం పొందాడు.