అదిగో కొండలపై వేంచేసి ఉన్నాడు 'శ్రీనివాసుడు'


 
మనం చూస్తున్న తిరుమలకు వరాహ క్షేత్రం అని పేరు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడి నుండి భూమిని రక్షించమని ఋషులు, దేవతలు చేసిన ప్రార్థనకు శ్రీమన్నారాయణుడు వరాహ స్వామిగా అవతరించి హిరణ్యాక్షుడిని చంపి భూమిని కాపాడాడు. ఆపై ఋషుల, దేవతల ప్రార్థన మేరకు శేషాచలాన్ని తన నివాస స్థానంగా ఎంచుకొని నివసించాడు.
 

 

                           

                                                                                  వరాహ క్షేత్రం

ఆతరువాత కలియుగంలో పద్మావతీ దేవిని వివాహం ఆడటానికి ముందు కూడా అన్ని యుగాలలో ఆయన ఎన్నో సార్లు ఈ కొండపై శ్రీనివాసుడిగా దర్శనమిచ్చాడు. పద్మావతి దేవి వేంచేసిన కాలానికి ముందు వాయుదేవుడికి, కుమార స్వామికి, రంగదాసు మరియూ శాంఖన రాజు వంటి మహనీయులకి ఆయన ఎన్నో సార్లు దర్శనమిచ్చినట్లు మన పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వచ్చి కొంతకాలం ఉండేవాడు తిరిగి తన ఆనంద విమానానికి వెళ్ళేవాడు. కానీ నిరంతరం మనం ఇప్పుడు చూస్తున్నాట్టుగా ఉండేవాడు కాదు.

 
ఆయనకు శ్రీనివాసుడని ఎందుకు పేరు ?

జగత్ కారణం ఏది ? అని వేదాన్ని అడిగితే "ఏకమేవ అద్వితీయం" అని చెప్పింది. ఆయన ఒక్కడే "సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్". ఎట్లా అయితే చెట్టు ఏర్పడటానికి గింజ కారణమో, ఈ ప్రపంచం అంతా ఏర్పడటానికి ఒక్కడే కారణం. గింజ నుండి చెట్టు రావాలంటే ఎన్నో కావాలి, ఎవరో ఒకరు నాటాలి, నేల కావాలి, నీరు కావాలి. కానీ ఇంత ప్రపంచాన్ని తయారు చేయడానికి కారణం ఒక్కడే. లోకంలో ఎదైనా చేయాలంటే నిమిత్తం, ఉపాదానం మరియూ సహకారాలు కావాలి. కానీ ప్రపంచం తయారు కావడానికి నిమిత్తం, ఉపాదానం మరియూ సహకారం అన్ని ఒక్కడే. అదెలా సాధ్యం ? మనకు తెలిసిన ప్రపంచంలో ఒక ఉదాహరణని వేదం ఇస్తుంది, సాలె పురుగు గూడు కట్టడానికి దారాన్ని ఎక్కడి నుండి తెస్తుంది. తనలోంచే తెస్తుంది. ఉపాదానం తానే. గూడు కట్టాలని అది అనుకుంటుంది కనక కడుతుంది. నిమిత్తం తానే. తన తెలివితోనే కడుతుంది, ఎవ్వరో సహకరించాల్సిన అవసరం లేదు. సహకారం తానే. అట్లా ఇంత ప్రపంచాన్ని పరమాత్మ చేసాడు. తనలో ఉన్న సంకల్పంతో, తన దేహంలో ఉన్న ఒక భాగంలోనే సృజిస్తాడు. తానే సంకల్పిస్తాడు, ఏమని "తదైక్షత భహుష్యాం ప్రజా యేయేతి" నేనే అనేకం అవుదును గాక అని అనుకుంటాడు. ఎన్ని యుగాలు పట్టును ? "యుగపత్ సృష్టికార్యం" ఒక్క సారిగా ఇంత ప్రపంచం తన సంకల్ప మాత్రంచే అయ్యింది. గింజ నుండి చెట్టు వచ్చినట్టుగా పరిణామం చెంది ఇప్పుడు మనం చూసేట్టుగా ఏర్పడ్డవి. పరిణామం అంటే జంతువు నుండి మనిషి పుట్టడం కాదు, ఏ ఏ లక్షణాలు గింజలో ఉంటాయో ఆయా లక్షణాలు చెట్టులో ఉన్నట్టు, కన బడని రూపంలోంచి కనిపించే రూపంలోకి వచ్చాయి ఇన్ని జీవరాశులు.
 
 
జగత్ కారణం ఒక్కటేనా అంటే, ఒక్కడు అంటే వాడితో ఎప్పటికి వదలక వీడనివి కొన్ని ఉంటాయి, వాటినే విశిష్టములు అని అంటాం. తత్వం ఒక్కటే అన్నప్పుడు దానితో సహజమైనవి కొన్ని ఉంటాయి, వాటితో కూడుకున్న ఒక్కటి. ఇదే విశిష్ట అద్వైతం. దేనితో విశిష్టం ? పండు అనేది ఒక ఆకారం, ఒక రంగు, ఒక  పరిమళం కలిగి ఉంటుంది. వీటిని వేరుగా విడదీసి చెప్పలేం. జగత్ కారణమైన పరమాత్మ ఒక్కడే, కానీ వేటితో కూడుకున్న వాడు అని ప్రశ్న వేస్తే, వేదానికి సారభూతం, శిరస్సు వంటిది పురుషసూక్తం. అది ఇస్తుంది వివరణ. "సహస్ర శీర్షా పురుషః" ఇదంతా తయారు చేసిన ఒకడు ఉన్నాడు, ఎంచేస్తాడు ఆయన అంటే, మనం చూసే ఎన్నింటినో చేసింది ఆయనే అని చెబుతూ చివర "హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ" ఆయన లక్ష్మీ ఇత్యాదులతో కూడి ఉండును అని చెబుతుంది. పరిమళాన్ని బట్టి పుష్పంని గుర్తించినట్లు, జగత్ కారణమైన వాడిని గుర్తించేది ఆయనలో వీడక ఉండే దయని బట్టి. ఆయనలో దయ ఎప్పటికీ ఉంటుంది. సంస్కృతంలో ఒక వస్తువుని గుర్తించడానికి ఉండే అసాధారణ ధర్మాలను లక్ష్మ అని అంటారు. లక్ష్మి అంటే గుర్తుగా తానైనది అని అర్థం. దేవుడు అంటే ఎవరు ? విశ్వమంతా బాగుండాలి అని మనం కోరితే, ఆ అరుపుకి స్పందించేవాడు దేవుడంటే. చిన్న చిన్న అరుపులకు స్పందించే వారు ఎందరో ఉండవచ్చు. ఇవి అరుపులు కావు, వాటిని ఆశలు అంటాం. అట్లా స్పందించాలి అంటే ఆయనకు ఉండాల్సినవి దయా, కరుణ, కృప, క్షమ లాంటివి. అట్లాంటి ఆయనని వీడని ధర్మం లక్ష్మి అంటే. ఆమెను కలిగినవాడు ఒకడు, లక్ష్మీ విశిష్టుడు. లక్ష్మీ సమేతుడు. ఇది వేదం చెప్పింది. అమ్మ లక్ష్మి మన మాట వింటోంది కనక శృణోతి, మన లోపాలు ఆయనకు కనబడకుండా చేసి మన గురించి ఆయనకు చెబుతుంది కనక శ్రావయతి, ఈ శృణోతి లేక  శ్రావయతి అంటే శ్రీ అని చెబుతారు. ఆ శ్రీని ఎప్పటికి నివాసంగా కలవాడు కనక ఆయన శ్రీనివాసుడు. ఆయన రాముడిగా వచ్చినప్పుడు ఆమే సీతగా వచ్చింది, వారు ఇరువురు ఒక చోట చేరితే లోక రక్షణ జరిగింది. అట్లా తిరుముల కొండపై వేంచేసిన స్వామి లోక రక్షణకై పద్మావతి దేవిని వివాహమాడి అశ్రితవత్సలుడు అని అనిపించుకునాడు. ఆయనకి శ్రీనివాసుడని, శ్రియపతి అని గుర్తింపు. జగన్నాథుడికి పేరు ఆమె వల్లే, నిర్గుణుడిని మనం ఆశ్రయించం. దయాసాగరమైనవాడు, సమస్త కళ్యాణ గుణములు ఉన్నవాడు కరుణాలవాలుడైన స్వామిని మనం ఆశ్రయిస్తాం.