శ్రీకృష్ణుడి ఉపదేశమే తప్ప వేరొక శరణ్యం లేదు

భగవంతుడు ఈ లోకంలో పుట్టడం అన్నటువంటిది జరుగుతుందా జరగదా? ఇదో పెద్ద ప్రశ్న, ఎందుకంటే లోకంలో చాలా మంది భగవంతుడు అస్సలు లేడు అనే వాళ్ళు కొందరు భగవంతుడు ఉంటాడు, నేనే భగవంతుడిని అని అంటూ ఉంటారు కొందరు, మరి కొంత మంది భగవంతుడు అయిపోవాలి మనమంతా కూడా, ఇదిగో మనమందరం భగవంతుళ్ళం అయిపోతాం అని ఇలా చెబుతుంటారు కదా మరి అలాంటప్పుడు వేరే దైవం అనేది ఒకటి లేదు అని తెలుస్తోంది, మరి అలా దైవం లేక పోతే మరి అప్పుడు నువ్వే జ్ఞాపకం పెట్టుకోవడం ఇప్పుడూ నువ్వే జ్ఞాపకం పెట్టుకోవడం, అప్పుడు నువ్వా చెప్పడం ఇప్పుడూ నువ్వా చెప్పడం, ఎట్లా తటస్థిస్తాయి? జ్ఞాపకం పెట్టుకోవడం ఎట్లా తటస్థిస్తుంది? అప్పటినుండి ఇప్పటిదకా కోనసాగేది ఎదో ఒకటి అనేది లేకుండా అనుస్యుతంగా అలాంటిది లేదనుకోండి ఎప్పటికప్పుడే కొత్త పుట్టుక మళ్ళీ దానికి కొత్త మరణం అనుకొండి, ఇందులో ఉండేటటువంటి సంస్కారాలు పక్క దానికి సంక్రమించే అవకాశం ఉండనే ఉండదు కదా? అస్సలు క్రింద జన్మ ఏమిటి అన్న ప్రశ్నే మనకు రాదు కదా! క్రింద జన్మ దాకా ఎందుకు, ఈ శరీరంలోనే మనం ముందు క్షణంలో ఏమి చేసాము అన్నదానికి తరువాత క్షణం దాని సంబంధం ఉండవలసిన అవసరం ఇంక ఇపుడు ఏర్పడనే ఏర్పడదు, మరి నీ జన్మలు నిజమా?  ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రశ్న వేసాడు అర్జునుడు, శ్రీకృష్ణుడు గ్రహించాడు, అద్భుతమైన శిష్యుడివి దొరికావయ్య అని అనుకున్నాడు, దానికి, చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న వేసాడని గర్వించిన శ్రీ కృష్ణుడు చక్కటి సమాధానం చెప్పాడు, ఓ ఆరు విషయాల గురించి వర్ణిస్తూ దానికి సమాధానంగా శ్రీ కృష్ణుడు చాలా అద్భుతమైనటువంటి 4వ అధ్యాయంలో 5వ శ్లోకాన్ని వివరించాడు.
 
శ్రీ భగవానువాచ
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జునా|
తాన్యహం వాద సర్వాణీ న త్వం వేత్థ పరంతప|| (4అ-5శ్లో)
అర్జునా! లోకంలో ఎన్నో శాస్త్రాలు ఎన్నో ఉపధేష్టలు ఎన్నో రకాల ఉపదేశాలు ఉండొచ్చు, కాని ఈ జీవుడెవ్వడు? దేవుడంటే ఏమి? ప్రకృతి అంటే ఏమి? ఈ మూడు కూడా నాకు తెలిసినంత స్పష్టంగా మరి లోకంలో ఎవరికి తెలియనే తెలియదు అంతే కాదు నీ గురించి కూడా నాకు  తెలిసినట్టుగా నీకూ తెలియదు, నిన్ను కన్న వాళ్ళకీ తెలియదు, లోకంలో ఉండే జీవుల గురించి కానీ, జీవులు ధరించే శరీరాల గురించి కానీ,ఈ జీవుడు ఈ శరీరంలోకి రావడం లో కానీ, రప్పించడం లో కాని దాని వెనకాతల గల కారణంగాని, నాకు తెలిసినంత వేరెవ్వరికి తెలియనే తెలియదు అని భగవంతుడు చెప్పాడు, అందుచేత మన గురించి ఆయనకే బాగా తెలుసు, మరి తెలుసును అని అంటే ఆయనకి తెలివి వాస్తవమా? కొంత మంది భగవంతుడు ఉత్తితిదే అండి, అస్సలు భగవంతుడు అంటూ ప్రత్యేకించి ఎవడున్నాడు? అస్సలు భగవంతుడికి రూపంలేదు, జ్ఞానంలేదు, భగవంతుడికి అవతారం లేదు, అదంతా కూడా కేవలం మిథ్య, మాయా, కల వలే అని అంటారు, అయితే కల అనడం పెద్ద ప్రమాదం, ఎందుకంటే ఒకడు కల గన్నాడు అంటే, కలని చూచిన వాడు ఉన్నాడు, కల కంటికి కనిపింప చేసే ఒక సంస్కారం లోపల ఒకటి ఉంది, మరి కల వచ్చినట్టుగా కలలో తెలీదు, మెలుకువ వచ్చాక తెలుస్తుంది,అలానే ఈ జీవితం లేక భగవంతుడు కూడా ఒక కల అని ఎవడైనా అనదలుచుకుంటే, వాడికి ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు, ఇందులోంచి  బయటకు వచ్చిన తరువాత చెప్పాలి, అప్పుడు వాడు ఉండడు, ఉన్నప్పుడు చెప్పడానికి వీలు లేదు పోతే మనకి వినిపించడానికి వీలు లేదు అంచేత అస్సలు ఆ మాటలే మనకి అంతగా పొందిక కలిగిన మాటలుగా కనిపించవు, అందుకే ఆ మాటలని సరి కాదని మనకి తెలుసుకో తగినవంటిదేదో చెప్పుతున్నాడు, హే అర్జునా! నేను సూర్యుడికి చెప్పానని చెప్పానే ఇప్పుడు మళ్ళీ నీకు జ్ఞాపకం చేసుకొని దాన్నే చెప్పుతున్నానంటే అప్పటినుంచి ఇప్పటిదాకా నేను ఉన్నాని అర్ధం.
 
 
మరి నీవు మెన్న పుట్టానంటున్నావే నాకన్నా ముందు అని అడిగావే అది వాస్తవం అంటే నేను పుట్టుక కావాలని అనుకుంటే ఆయా కాలానికి ఆయా సమయానికి ఆయా సంధర్భానికి ఏదో ఒక శరీరాన్ని ధరిస్తున్నాను నువ్వు చేత కాక పుడుతున్నావు, నేను కావాలని ధరించి పట్టుకువస్తున్నా వేషం వేసుకువచ్చే నటుడి లాగా, నటుడికి తాను తెలుసును ఏ వేషం ఎప్పుడు వేయించుకోవాలనేటటువంటిది, నేను అట్లా వస్తున్నాను, లోకం కోసం నేను వస్తున్నాను, అంచేత ఎన్ని జన్మలు నేను ఇట్లా ఎత్తానూ అనేది, ఇన్ని అని చెప్పడం చాలా కష్టం.
 
 
నీకు జన్మలు వాస్తవమా కాదా? అని అర్జునుడిని అడిగాడు మరి ఈ జీవితంలో చేసే పనులు వాస్తవమా అవాస్తవమా? తల్లి నిజమా అబధ్ధమా? తండ్రి నిజమా అబధ్ధమా? శత్రువు మిత్రుడిగా కనిపించేటటువంటి లోకం వాస్తవమా అవాస్తవమా? నీవు చేసే పనులు వాస్తవమా కాదా? నువ్వు తినే తిండి వాస్తవమా కాదా? నువ్వు ఆడే ఆట వాస్తవమా కాదా నువ్వు చూసే దృశ్యాలు వాస్తవమా కాదా? ఈ ప్రపంచంలో అన్ని వాస్తవాలే అందుకే నీ బ్రతుకు కూడా వాస్తవం కావాలి, నీ బ్రతుకి కావలసినటువంటి నియమం కూడా వాస్తవం కావాలి, ఇవన్నీ అవాస్తవమైనట్టైతే ఉండిన్నంత కాలం లభించినంత శుభ్భరంగా లభించు, కనిపించినవాడిని చావగొట్టు చావగొట్టి సంపాదించు, సంపాదించి తినగలిగినంత తిను, దొరికింది సుభ్భరంగా దోచుకో, అడ్డువచ్చిన వాడిని తీసిపారెయ్, హాయిగా జీవించు, విలాసానికి అడ్డే ఉండక్కర్లేదు, ఎందుకంటే అంతా మిథ్యే కదా వ్యవస్థ ఏమిటి కనుక, అధర్మమేమిటి కనుక, న్యాయమేమి అన్యాయమేమి?ధర్మమేమి అధర్మమేమి? ఇవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదు, ఉన్నంత వరుకు హాయిగ తినడం అంతే, కాని ఇది ఒప్పుకుంటామా? ఇదా సమాజం, అదా నీతి? అదా ధర్మం? అదా క్రమం? కాదిక్కడ, నీ బ్రతుకు వాస్తవం, నీ చుట్టూ ఉండేవాళ్ళ బ్రతుకులు వాస్తవం, ఎవడితో నీవు ఎట్లా ప్రవర్తించాలో అది కూడా వాస్తవం అని తెలుసుకొని ప్రవర్తించడం ప్రతి మనిషి కర్తవ్యం, జీవితం నిజం, జీవితంలో ప్రతీక్షణం నిజం, అనుభవించే ప్రతీ అనుభవం నిజం, ఎవడైనా ఏడుపు కావాలని కోరుకుంటాడా? కష్టాలు రావాలని కోరుకుంటాడా? నష్టాలు రావాలని కోరుకుంటాడా? దుఃఖాలు మీద పడాలని ఎవడైనా కోరుకుంటాడా? ఎవ్వడు కోరడు కాని తప్పదు, పొద్దున్నలేస్తే రాత్రి పడుకునే దాకా దుఃఖాలు, రాత్రి పడుకుని మళ్ళీ పొద్దున్న లేచే దాకా దుఃఖాలు, అంటే జీవితంలో ఎన్నో మనం కోరుకోనివి వస్తున్నాయి వాటిని మనం అనుభవిస్తున్నాం అది వాస్తవమే, అనుభవించే వాళ్ళం మనకి తెలుసు  ప్రతీ వ్యక్తికీ తెలుసును తన తన జీవితంలో అనుభవించేవన్నీ కూడా వాస్తవాలే, దాన్ని దృష్టాంతంగా పెట్టాడు శ్రీ కృష్ణుడు, నీ బ్రతుకు ఎట్లాగైతే వాస్తవమో, పొందే ప్రతీ అనుభవము నీకు నిజమో అలానే నా జన్మ కూడా నీ జన్మంత యధార్ధం, అంత వాస్తవం.
 
అయితే ఎన్ని జన్మలు ఎత్తావు? లేక్కలేనన్ని, ఆకాశంలో ఉండే నక్షత్రాలకి లెక్కలేనట్టే, సముద్రంలో ఉండే నీటి బొట్లకి లెక్కలేనట్టే, తీరంలో ఉండే ఇసుక రేణువులకి లెక్కలేనట్టే, నా జన్మలకి కూడా లెక్క లేదు. ఒక్క నా వరుకే కాదు, హే అర్జునా! నీ జన్మలు కూడా అంతే, నువ్వు కూడా ఇప్పటిదాకా ఎన్ని జన్మలు ఎత్తావో , అంటే ఆ వాళ్ళనుంచి ఈ వేళ్ళ దాకా మనం చూసినట్టైతే కొన్ని కోట్ల జన్మలు అయిపోవట్లేదా? ఐతే ఒక్క తేడా ఉంది ఏమిటా తేడా? ఏ ఏ జన్మ నేను ఎత్తానో, ఎప్పుడెప్పుడు ఎత్తానో, ఎలా ఎత్తానో, ఎక్కడ ఎత్తానో, ఎత్తి ఏమి చేస్సానో ఇవన్ని కూడా, నాకు తెలుసు స్పష్టంగా తెలుసు, నేను ఏమి చేసానో కాదు ఆయా సమయాల్లో నీవు ఎక్కడెక్కడ ఎలా ఉన్నావో కూడా నాకు తెలుసు. ఇది తమాషా, అందుకే భగవంతుడు సర్వజ్ఞుడు. అన్నీ తెలుసనమాట, మన గురించి తెలుసును, తన గురించి తెలుసును, నీకు తెలుసుకదా అని అయితే నాకెందుకు తెలియకూడదు అని నీవు అడగడానికి లేదు, నీవు పరంతుకుడివి, గొప్పవాడివి, తపస్సు చేసావు, యోగ్యతని సాధించావు, ఇతరులిని తపింపచేసే తేజస్సు అర్జునా! నీలో ఉంది, అయినా కూడా నీ జన్మలు నీకు తెలియవు, ఎప్పుడు పుట్టావో, ఎలా పుట్టావో, నీకు తెలియనే తెలియదు కాని తనకి మాత్రం అన్నీ తెలుసును అని అన్నాడు, మరి ఇదేమిటి? ఆయనకి తెలిసి మనకి తెలియకపోవటమేమిటి? అంటే మనం వచ్చింది కర్మ వల్ల దాని చేత జ్ఞానం మూతబడింది, అయిన వచ్చింది కృప వల్ల అందుచేత అయినకి జ్ఞానం మూత అనేది ఏర్పడనే ఏర్పడలేదు, అంచేత ఆయినకే తెలుస్తుంది, భగవంతుడి యొక్క జన్మలు యదార్ధం, భగవన్ జన్మలే కాదు మన జన్మలు కూడా యదార్ధం, జన్మలే కాదు మనం పొందే ప్రతీ అనుభవము యదార్ధమే, ఇది మనం మర్చిపోకూడదు. అందుకోసం నీకు మంచి అనుభవాలు కావాలంటే మంచి పనులు చేయాలి, చూడండి ఎప్పుడైనా మనం వీడియో ప్లే చేసేటప్పుడు, మంచి దృశ్యాలు అందులో కనిపించాలీ అని అంటే, వీడు అన్ని రకాల అశ్లీల దృశ్యాలు షూట్ చేసి దాన్ని పట్టుకొచ్చి,మంచి దృశ్యాలు కనిపించవలెను అని దాని ముందు తపస్సు చేస్తే అందులో మంచి బొమ్మలు వస్తాయా? రావు, నువ్వు ఎలాగైతే దానిలో షూట్ చేసావో,అందులో కనిపించేటివన్నీ అట్లాంటివే వస్తాయి తప్ప, అందులో లేనివి ఎలాగైతే రావో, అలానే మనకి కూడా ఏరకమైనటువంటి భావనని మనలో నింపుకుంటామో అదే భావన మనలో వాస్తవీకతని సంతరించుకుంటాయి.
 
 
"హే అర్జునా! నీవు ఏవేవి ఎక్కడెక్కడ ఎత్తావో నాకు తెలుసును కాని అవేవి కూడా నీకు తెలియనే తెలియవు, భగవంతుడియొక్క జన్మలు వాస్తవం, జన్మలో చేసే పనులు వాస్తవం కనుక మనందరికి ఈ లోకంలో రావడానికి కారణమైనటువంటి కర్మ ఎలా తొలగాలో కూడా మనం తెలుసుకోవాలి" ఇది స్వామి చెబుతున్నాడు. మనందరికీ కూడా అనుకున్నట్టు జీవితాలు సాగటంలేదు, దానికి కారణం ఏమిటి, అంటే మనం చేసే ప్రతీ పని వెనుక అహంకారాన్ని మనమీద ఆరోపించుకుంటున్నాం కనుక మనకి తెలియటంలేదు, మరి అయినకి తెలుసును అయిన నిరహంకారి కనుక అందుకే మన అవతారాల గురించి కృష్ణుడు చెప్పింది ఏమిటో అది మనం వినాలి, మనమెవరమో, భగవంతుడు అంటే ఎవరు, మనమిక్కడికి ఎందుకొచ్చాం, ఎలా కలిసాం, తరించాలి అన్న కోరికైతే అందరికి ఉంటుంది,కానీ ఎవరిని ఆశ్రయించాలో మనకి తెలియదు, ఎలా ఆశ్రయించాలో తెలియదు కోరిక ఉంటుంది కాని మనమెవరమో తెలియదు, మనమిక్కడినుంచి ఎట్లా బాగు పడాలో ఎట్లా బయటికి వెళ్ళాలో మనకి తెలియదు, కొంత మందికి బ్రతకడం ఇష్టం లేక, దానిలోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు చాలా ప్రమాదం అది, తిరిగే పెద్ద రంగులరాట్నం లోంచి ఆ తిరిగేటప్పుడు కలలిగేటటువంటి మనసికమైన, శారీరికమైన రియాక్షన్ని బట్టి, అబ్బో నేను ఇందులో కూర్చోలేను బయటకి దూకేస్తాను అని కిందికి దూకేస్తే ఎంత ప్రమాదమో, అలానే ఈ శరీరం భగవంతుడు ఏర్పరిచినటువంటి ఒక పెద్ద రంగులరాట్నం, అయ్యో నేను ఇందులో బ్రతకలేక పోతున్నాను అని ఎవరైనా ఇందులోంచి దూకే ప్రయత్నం చేసినట్టైతే, వాడికి అన్ని రకాలుగా నష్టమే ఏర్పడుతుంది తప్ప వాడికి సుఖం అనేటటువంటిది కలుగనే కలుగదు, అంచేత అలాంటి ప్రయత్నాలు మనకి అక్కర్లేదు, నువ్వెవరవు, భగవంతుడంటే ఎవరు, నీకు భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటి? తెలుసుకుని నువ్వు ఇక్కడ చెయాల్సిన పని ఏమిటి? తెలిసినా నువ్వు దాన్ని చేయలేక ఎయే ఆటంకాలు నువ్వు ఎదురుకుంటున్నావు వాటిని ఎట్లా తొలగించుకోవాలి? ముందుకెట్లా సాగాలో నాకు తెలుసును, నాకే తెలుసును, నేను చెబుతాను, అందుకే కృష్ణుడు నేనెరుగుదును అని చెప్పాడు, చెప్పి అక్కడితో ఆగలేదు నేను తెలుసును నాకు తెలుసును కాని నీకు తెలియవు, నువ్వెవరివో కూడా నీకు తెలియవు, అందుకే శ్రీ కృష్ణుడు చేసిన ఉపదేశాలు లోకాలకి కాంతులీనేటటువంటి ఒక జ్యోతి, బాగు పడదలచిన ప్రతీ వ్యక్తికీ కూడా ఆ ఉపదేశమే పరమశరణ్యం. చీకటిలో ఉండే వ్యక్తికి దీపం ఎంత అవసరమో, ఈ మానవ జన్మలో ఉండే ప్రతీ వ్యక్తికి, దీనిలోంచి బయట పడాలి అని అంటే లేదా ఇందులో ఆనుకూల్యం కలగాలి అని అనుకుంటే ఆ శ్రీకృష్ణుడి ఉపదేశమే తప్ప వేరొక శరణ్యం లేదు అనేది 4వ అధ్యయంలో 5 వ శ్లోకం లో శ్రీకృష్ణుడు ఉపదేశం చేసాడు ఈ గీతా జ్యోతి మనలో వెలిగిద్దాం కేవలం మనలోనే కాదు, తరించ కోరిక కలిగిన ప్రతీ వాడికి దీని అందించడం మన భాధ్యత దానిని సాధన చేసుకుంటూ ముందుకి సాగుదాం.