Samskruti Kumbh
నది వొడ్డున చెట్టు చల్లన - చెట్టు నీడన నది చల్లన
Veni Madhavi, Editor
jmveni@gmail.com
గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ప్రకృతిలో నదుల ప్రాముఖ్యత, పౌరాణిక, శాస్త్రీయ మరియు పర్యావరణ సంబంధిత విశేషాలను చూద్దాము. ప్రపంచంలోని 175 అతి పెద్ద నదులలోకి గోదావరి నది ఒకటి. దీనిని దక్షిణ గంగగా కూడా అభివర్ణిస్తుంటారు.
గురు గ్రహము ప్రవేశించే రాశిని బట్టి ఆయా నదులకు పుష్కరాలు వస్తుంటాయి. 12 రాశులకి 12 నదులు, 12 సంవత్సరాలకు ఒక సారి పుష్కరాలు రావటం ఆనవాయితీ. గురు గ్రహము సింహ రాశిలో ప్రవేశించిన ఈ ఏడాది గోదావరి నదిలోకి పుష్కరుడు ప్రవేసిస్తాడు. అతడితో పాటుగా సమస్త నదులు, దేవతలు ఋషులు కూడా సుక్ష్మ రూపాల్లో ప్రవేశిస్తారు. వీరే కాకుండా పితృ దేవతలు కూడా తర్పణాలను స్వీకరించేందుకు వస్తారని పురాణ ప్రశస్తి.
సంస్కృతంలో పుష్కరము అన్న పదానికి చాలా అర్ధాలు వున్నాయి.
పుష్ + కర = పుష్టి కరము అంటే పోషణను ఇచ్చేది.
మరి కొన్ని సందర్భాల్లో పుష్ప్ కర్ - పద్మము వున్న చెయ్యి అని కూడా అర్ధం చెప్పబడింది.
తామర కొలను / నీలోత్పలము / ఆకాశము / కొలను / కరవాలము (పెద్ద కత్తి) / హంస / పవిత్ర జలము మొ||
ఏనుగు తొండము చివరి భాగాన్ని, వాధ్య ముఖాన్ని(మృదంగం, తబలా మొ||) కూడా పుష్కరమని అంటారు.
శ్రీ విష్ణు సహస్ర నామంలో కూడా మనకి ‘పుష్కరాక్షః ‘ అన్న నామం కనిపిస్తుంది. దీనికి పద్మం లాంటి కన్నులున్న వాడు అని సామాన్య అర్ధం వస్తుంది. కాగా అంతరార్ధాలు అనేకం వున్నాయి.
తిరుమలలో శ్రీ వరాహ స్వామి ఆలయం వద్ద ‘స్వామి పుష్కరిణి’ అనే కోనేరు వుంది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారి చక్ర స్నానం ఈ పుష్కరిణిలో ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఇది ఎంతో విశేషమైన తీర్ధంగా పురాణ గాధలు తెలుపుతున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో కూడా పుష్కర నవాంశ అన్న పదాన్ని వింటుంటాము. దీనిలో వున్న గ్రహాలను అది శుద్ధి చేసి పోషణను ఇస్తున్నట్లు చెప్పబడింది. ఇది కూడా గురు గ్రహ సంచారాన్ని అనుసరించి వుంటుంది. ఈ పుష్కర నవాంశలోకి వచ్చే హాని కలిగించే గ్రహాలు కూడా సౌమ్యంగా వుంటాయని శాస్త్రోక్తి. వివాహ సమయంలో ఈ అంశాన్ని అనుసరించి బలమైన ముహూర్తాలను పెట్టటం చూడవచ్చు.
రాజస్థాలోని అజ్మీర్ సమీపంలో ‘పుష్కర్’ అన్న పుణ్యక్షేత్రం వుంది. అక్కడ వున్న సరస్సుని సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సృష్టించినట్లు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినట్లు అక్కడి స్థల పురాణం చెబుతుంది. దీనికి 52 స్నాన ఘాట్లు వున్నాయి. ఇక్కడ 14వ శతాబ్దంలో నిర్మించిన బ్రహ్మ దేవాలయం కూడా వుంది.
పుష్కర సమయంలో చేయవలసిన దానాల గురించి పురాణాల్లో ఈ విధంగా సూచించబడింది.
పుష్కర సమయంలో చెయ్యవలసిన దానాలు:
మొదటి రోజు - సువర్ణ దానం, రజితము దానం, ధాన్య దానం, భూదానం చేయాలి.
రెండవరోజు - వస్త్ర దానం, లవణ దానం, రత్న దానం చేయాలి.
మూడవ రోజు - గుడ(బెల్లం), అశ్వశాఖ, ఫల దానం చేయాలి.
నాల్గవ రోజు - ఘృతం(నెయ్యి)దానం, తైలం(నూనె)దానం, క్షీరం(పాలు), మధువు(తేనె)దానం చేయాలి.
ఐదవ రోజు - ధాన్యదానం, శకట దానం, వృషభదానం,హలం(నాగలి) దానం చేయాలి.
ఆరవ రోజు - ఔషధదానం, కర్పూరదానం, చందనదానం, కస్తూరి దానం చేయాలి.
ఏడవ రోజు - గృహదానం, పీట దానం, శయ్య దానం చేయాలి.
ఎనిమిదవ రోజు - చందనం, కందమూలాల దానం, పుష్ప మాల దానం చేయాలి.
తొమ్మిదవ రోజు - పిండ దానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.
పదవ రోజు - శాకం(కూరగాయలు)దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం చేయాలి.
పదకొండవ రోజు - గజ దానం చేయాలి.
పన్నెండవ రోజు - తిల(నువ్వులు)దానం చేయాలి.
కాబట్టి వీటిలో కొన్నింటిని ఇప్పటి కాలానుగుణంగా అన్వయించుకొని చేయడం ఉత్తమం. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి కొన్నింటిని చూద్దాము.
అశ్వద్ధ శాఖ, ఔషధాలు, పండ్లు, కూరగాయలు, కందమూలాలు, పువ్వులు, చందనం మొదలగునవి.
అశ్వద్ధ శాఖ అంటే రావి కొమ్మ అని అర్ధం. దీని బదులు అనువైన చోట రావి చెట్టు నాటటం ఈ రోజుల్లో అత్యవసరంగా కనబడుతుంది. అదే విధంగా ఔషధులు, పువ్వులు కూరగాయలు మొ|| వాటికి బదులుగా ఆ యా విత్తనాలు లేదా మొక్కలను దానమివ్వటం సర్వదా శ్రేయోదాయకం. దానమందుకొన్న వారి వద్ద ఆ మొక్క వున్నంత కాలం వారికి ఆ పుష్పాలు, ఫలాలు అందుతూనే వుంటాయి. కూరగాయ మొక్కలు సాధారణంగా వార్షిక మొక్కలు అంటే ఒక కాపు అనంతరం చనిపోతాయి. అయితే రావి, చందనం వంటివి మాత్రము కొన్ని దశాబ్దాల వరకు జీవిత కాలం కలిగి వుంటాయి. ఇవే కాక నవగ్రహ, నక్షత్ర మరియు రాశి వనాలను పరిశీలించినట్లైతే
గురు గ్రహం – రావి చెట్టు: గురు గ్రహం యొక్క చైతన్యం తేజస్సులు రావి చెట్టుతో అనుసంధానం చెంది వుంటాయి. అదే విధంగా సింహ రాశికి పాదరి చెట్టు సూచించ బడింది. ఇది సువాసన వున్న పుష్పాలు పూసే ఒక అడవి చెట్టు. మరి సింహ రాశిలో వున్న నక్షత్రాలను చూస్తే ఈ విధంగా వున్నాయి.
మఖా నక్షత్రం ----- మఱ్ఱి చెట్టు.
పుబ్బ/పూర్వ ఫల్గునీ నక్షత్రం ------ మోదుగ చెట్టు.
ఉత్తరా నక్షత్రం ------- జువ్వి చెట్టు.
ఈ దివ్య వృక్షాలను దానం చేసి అనువైన చోటులో నాటేలా చూడటం ఉత్తమోత్తమం.
గోదావరి ఒక జీవ నది. మహారాష్ట్ర లోని నాసికా త్రయంబకంలో పుట్టిన ఈ నది తెలంగాణా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, పుదుచేరీ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఏటా కురిసే వానల ద్వారా దీనికి అందే నీటితో నిత్యం ప్రవహిస్తూనే వుంటుంది. వివిధ ప్రాంతాల్లో, విభిన్న రూపాల్లో వున్న గోదావరీ మాత విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.
పైన చుసిన అర్ధాల ప్రకారం నదులు భూమిపై నున్న సమస్త జీవజలానికి పోషణను ఇచ్చేవిగా చెప్పవచ్చు. మనము భోజనానికి ఉపక్రమించే ముందు ఉచ్చరించే శ్లోకంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉదకం నారాయణ స్వరూపం అని చెప్పుకొంటాము కదా, ఆ విధంగా చూసినా నారాయణుడంటే పోషించే వాడు, కాబట్టి నీరు పుష్టిని పోషణను ఇచ్చేదిగా తెలుస్తుంది.
అయితే ఈ జీవ నదులలో నిత్యం జలం వుండటానికి కారణం చూస్తే, అది సంవత్సరంలో ఒక్కసారి కురిసే వానలు మాత్రమేనని శాస్త్రీయ ప్రక్రియలను పరికిస్తే తెలుస్తుంది.
జలచక్రం:
ఇంకొంచెం వివరాల్లోకి వెళితే, మన ప్రాంతంలో సాధారణంగా మూడు కాలాలను చూస్తాము. వర్షా కాలం, శీతా కాలం, ఎండాకాలం. వర్షా కాలంలో చెరువులు, సరస్సులు నిండి, కాలువలు ఏర్పడి, అవి ఉపనదులు, నదులలో కలుస్తాయి. చివరకు నదీ జలం సముద్రాల్లోనూ అవి తిరిగి మహా సముద్రాల్లోనూ కలుస్తాయి. కొంత నీరు భూమిలో ఇంకి భూగర్భ జలంగా మారుతుంది. శీతాకాలం ముగిసాక, ఎండాకాలంలో సూర్యుడి ప్రతాపానికి సముద్రాలు, నదీనదాలు, చెరువులు, సరస్సులు మొదలగు వాటి నుంచి నీరు ఆవిరై పోతుంది. అవి క్రమేణా తెల్లటి మేఘలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు గాలిలోని తేమని నింపుకుంటూ చల్ల బడినప్పుడు వర్షిస్తుంది. ఈ విధంగా భూమిపై జల చక్రం ఏర్పడుతుంది.
ఈ తెల్ల మబ్బులు సాధారణంగా వర్షించవు. అవి అడవులపైకి వచ్చినప్పుడు వర్షిస్తాయి. ఎందు చేతనంటే మొక్కలు నిత్యం భూమినుంచి నీటిని పీల్చుకొని వివిధ ప్రక్రియల్లో వినియోగించుకొంటుంది. మిగిలిన నీరు ఆవిరి రూపంలో గాలిలోకి చేరుతుంది. ఆ గాలిలోని తేమని మబ్బులు పీల్చుకొని చల్ల బడినప్పుడు వర్షించడం జరుగుతుంది.
కొండలు, పర్వతాలు మబ్బులను అడ్డుకొన్నప్పుడు కూడా అనుకూల పరిస్థితుల్లో వాన పడుతుంది. నదుల్లోని నీటికి ఈ వర్షమే ఆధారం. ఈ విధంగా భూమిపై నీరు నిత్యం రూపాంతరం చెందుతూ వుంటుంది. ఈ ప్రక్రియనే జలచక్రం అని అంటారు. ఈ క్రమంలో ఏది సమతుల్యతను కోల్పోయినా అతివృష్టి అనావృష్టుల వంటివి వస్తుంటాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో భూతలం పైని అడవులు త్వరితగతిన అంతరించిపోతున్నాయి. ఆ ప్రభావాన్ని ప్రకృతి వైపరీత్యాల రూపంలో మనం తరచూ చూస్తూనే వున్నాము. మానవులు చేపడుతున్న పనుల వల్ల కొన్ని మేలు జరుగుతుండగా చాల వరకు హాని కలిగించేవిగా వుంటున్నాయని, వాటి పరిణామాల్ని చూసిన తరువాత వివిధ దేశాల వారు తాము చేసిన పొరబాట్లను గ్రహిస్తున్నారు. ఉదాహరణకి గ్లోబల్ వార్మింగ్ అన్నది మితిమీరిన పారిశ్రామీకరణం, వాయు కాలుష్యం మొదలగు వాటి వల్ల సంభవిస్తున్న వైపరీత్యం. ఇప్పుడిప్పుడే వాటిని సరిదిద్దే లేక నెమ్మది పరిచే కార్యాలను చేపడుతున్నారు. వాటిలో ముఖ్య మైనది విరివిగా మొక్కలను నాటే ప్రక్రియ.
గోదావరి వొడిలో అంకురించిన భూ సంజీవని - మన కడియం
ప్రపంచంలో 175 పెద్ద నదులు వుండగా వాటి వెంబడి యుగాల తరబడి అనేక అడవులు, నగరాలూ నాగరికతలు అభివృద్ధి చెందాయి. నదీ తీరాలు అత్యంత సస్యస్యామలమైన ప్రాంతాలు. సాధారణంగా ఈ ప్రదేశాల్లో వ్యవసాయము, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, విధ్యుధుత్పత్తి కేంద్రాలు, ఉద్యానవనాల వంటివి ఏర్పడతాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా మన తెలుగు ప్రాంతంలోని రాజమండ్రికి సమీపంలో ప్రకృతికి ప్రాణం పోసే ఆలోచన పుట్టటం మనందరి సౌభాగ్యం. దేశ విదేశాల్లో పచ్చదనం పెంపొందించే అంకురాలకి బీజం కడియంలో పడింది. 3,500 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మందికి ఉపాదిని కల్పించేంత పని వుండటం విశేషం. ఆదికవి నన్నయ్య భట్టారకుడు, రాజరాజ నరేంద్ర, కందుకూరి వీరేశలింగం, దుర్గా భాయిదేశ్ ముఖ్ మొదలగు ప్రముఖులు పుట్టిన గడ్డ పై ఇటువంటి ఉన్నతమైన ఆలోచనా పరులు పుట్టటం సహజమే.
ప్రకృతిని తిరిగి పునరుజ్జీవింపజేసే వృత్తిని ప్రధానంగా ఎంచుకొని ఆసియా ఖండంలోనే అతి పెద్ద మొక్కల నర్సరీగా అతి తక్కువ సమయంలోనే పేరు గాంచిన కడియం మన ప్రాంతంలో వుండటం మనందరి అదృష్టం. ఈ ప్రాంతంలో ఎటు చూసినా కనుచూపు మేర వరకూ పచ్చని సముద్రం వలె కనిపిస్తుంది. భారతావని నలుములలనుంచే గాక విదేశాలకు కూడా ఇక్కడి మొక్కలు ఎగుమతి కావటం మొక్కలను పెంచే వృత్తిపై వారికున్న మక్కువ, ఆదరణలు ప్రస్పుటమౌతున్నాయి.
కడియం అంటే సాధారణ అర్ధం కాళ్ళకి వేసుకొనే ఆభరణం అని మనందరికి విదితమే. అయితే దాని వెనుక నున్న శాస్త్రీయతను చూస్తే అవి మన శరీరంలోనుంచి బయటకుపోవు శక్తిని తిరిగి మనలోకి పంపేటందుకు సహకరిస్తాయని తెలియవస్తుంది. మన కడియం నర్సరీలు కూడా యాదృశ్చికంగా అటువంటి పనినే చేస్తున్నాయి. ప్రకృతిలోని ప్రాణ వాయువును తిరిగి నింపే వృక్షాలకు ఇక్కడ అంకురార్పణ చేస్తున్నారు. ఈ పవిత్ర గోదావరి జలముతో ప్రాణం పోసుకొని పెరిగి నలుదిక్కులా మఱ్ఱి చెట్టు వలె వ్యాప్తి చెందుతున్నాయి. మన దేశంలో ఇంకనూ పురాతనమైన నర్సరీలు వున్నప్పటికినీ ఇక్కడ వున్నంత వైశాల్యములో వైవిధ్య మైన, నాణ్యమైన మొక్కలు మరెక్కడా లభ్యమవ్వని విధంగా వుండటం ఇక్కడి ప్రత్యేకత.
నదులు చల్లగా వుండాలంటే, వాటిలో నిరంతరం నీరు ప్రవహిస్తుండాలంటే విరివిగా మొక్కలను నాటాలి.
చెట్టు విలువ :
ఈ మధ్య కాలంలో కోల్కతాకు చెందిన ఒక వృక్ష శస్త్ర నిపుణుడు, ఒక చెట్టు దాని జీవిత కాలంలో ఇచ్చే ప్రాణ వాయువు, కలప, గాలిలో అది శుద్ధి పరచే శాతం మొదలగు అంశాలను దృష్టిలో వుంచుకొని దానికి వెల కట్టగా ఈ విధంగా లెక్కలు తేలాయి. విదేశాల్లో కూడా కొందరు అక్కడి చెట్లకి వెల కట్టే ప్రయత్నం చేయటం జరిగింది.
ఈ లెక్కల్లోని సత్యాసత్యాల మాటను ప్రక్కన పెడితే అటు పురాణాల్లో చూసినా ఇటు వృక్ష శాస్త్ర పరంగా చూసినా ఒక చెట్టు తన జీవిత కాలంలో మన పర్యావరణానికి వెల కట్టలేనన్ని సేవలను అందిస్తుందన్నది సుస్పష్టమౌతుంది.
ఈ క్రమంలోనే నదీ జలం పైన ఆధారపడి అడవులు విస్తరిస్తున్నాయి. అదే విధంగా అడవుల వల్ల మేఘాలకి అనువైన వాతావరణం ఏర్పడి సకాలంలో వర్షాలు కురవడం వల్ల నదులు మనకి పుష్కలంగా నీటిని అందించ గలుగుతున్నాయి.
దీని బట్టి నదులూ చెట్లు అవినాభావ సంబంధం కలిగి వున్నాయని తెలియవస్తుంది.
నది వొడ్డున చెట్టు చల్లనా| చెట్టు నీడలో నది చల్లనా||
కవులు పాటలను భావుకతతో వ్రాసినా గానీ వాటిలో కూడా కొన్ని సత్యాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి: ‘గోదారీ గట్టుందీ, గట్టు మీదా చెట్టుందీ, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముందీ?.....................”
పర్యావరణం సమతుల్యతతో వున్నప్పుడే సమస్త జీవులకి శ్రేయస్సు కలుగుతుంది.
పుష్కర కాలం ఎంతో పవిత్రమైనది. ఈ పన్నెండు రోజుల్లో చేసే దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో రెట్ల అధిక ఫలితాలని ఇస్తాయి. మనము ఇప్పటి వరకు నదులు వృక్షాల గురించిన పౌరాణిక మరియు ఆధునిక శాస్త్రీయ విశిష్టతలను గురించి చూసాము. గోదావరి, రాజమండ్రి, కడియంల గురించిన పలు విశేషాలను చూసాము. ఈ రోజు కోన సీమ ప్రాంతం ఇంత సస్యశ్యామలంగా పాడి పంటలు పశువులు పరిశ్రమలు మొదలగు వాటితో తులతూగుతుందంటే కారణం ఒక మహానుభావుడి అకుంటిత సేవల వల్లనే. ఆయన గురించి ప్రస్తావించక పోతే ఈ వ్యాసం అసంపూర్ణంగా వుండిపోతుంది అనటం అతిశయోక్తి కాదు.
ఒక శతాబ్ద కాలం క్రితం వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంత పెద్ద జీవ నది ప్రవహిస్తున్నప్పటికినీ, ఓ ప్రక్క కరువు పరిస్థితులు, మరోప్రక్క తుఫానులు తరచుగా సంభవిస్తుండేవి. గోదావరి జలాలు అది పారే దారి వెంబడి వ్యవసాయ మరియు గృహావసరాలకు నీటిని అందిస్తూ మిగిలిన నీరంతా వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోయేవి. అయితే 18వ శతాబ్దంలో భారత దేశం ఇంకా బ్రిటీషు హయంలో వుండగా, సర్ ఆర్థర్ కాటన్ అనే నీటిపారుదల శాఖ ఇంజినీరు ఆధ్వర్యంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించటం, 1850లో దానిని జాతికి అంకితం ఇవ్వటం జరిగింది. ఆ మీదట ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నింటికీ చక్కటి నీటి పారుదల పద్ధతుల ద్వారా పుష్కలంగా నీటిని అందించడం జరిగింది.
గోదావరి దక్షిణ గంగ కాగా కాటన్ దొరని అపర భగీరదునిగా ఈ ప్రాంత ప్రజలు ఆయన చేసిన సేవలకు గానూ ఈ రోజుకీ ఎంతో ఆదరాభిమానాలను చూపిస్తుంటారు. కేవలం ఈ రెండు జిల్లాల్లోనే ఆయనవి 3,000లకు పైగా విగ్రహాలు వుండటం దీనికి తార్కాణం. మే 15న ఆయన జన్మ దినాన్ని ఎంతో వేడుకగా చేసుకొంటారు. విదేశీయుడైనప్పటికినీ కడియంలోని నర్సరీ యజమానుల సంఘంకి ఈ మహానుభావుడి పేరు పెట్టుకోవటం, కాటన్ దొర వీరికి చేసిన మేలు మరియు వారికి ఆయన పట్ల వున్న ఆదరాభిమానాలు రెండూను వ్యక్తమౌతున్నాయి. కాటన్ దొరకి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తమిళ్, ఒరిస్సా, బెంగాలు మరియు బీహార్ రాష్ట్ర ప్రజలు కూడా రుణ పడి వుంటారు. మన ప్రాంతంలోని పురోహితులు ఈయన పేరున శ్లోకం చెప్పి అర్ఘ్యం విడిపిస్తారు.
ఆ శ్లోకం ఈ విధంగా వుంది:
నిత్య గోదావరీ స్నాన పుణ్యదో యో మహామతిహి:
స్మరామ్యాంగ్లేయ దేశీయం స్మరామి ఆంగ్లేయ కాటనుం తం భగీరధం!
(మాకు గోదావరీ స్నాన పుణ్యాన్ని ప్రసాదించిన, అపర భగీరధుడు, ఆంగ్ల దేశానికి చెందిన కాటన్ గారిని నిత్యం స్మరించి తరిస్తున్నాము.)
[*మూలం: సుశాస్త్రీయం - అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ దొర - టీవీయస్.శాస్త్రి]
కాటన్ దొర ఎక్కడ వున్నా సరే గోదావరీ నది ప్రవహిస్తున్నంత వరకూ ఆయన కీర్తి వ్యాప్తి చెందుతూనే వుంటుంది. ఇక్కడి ప్రజల మనస్సుల్లోని కృతజ్ఞతా భావాలు ఆయన ఉత్తమ లోకాలు, జన్మలు తీసుకొనేందుకు తోడ్పడతాయి. ఆయన 96 ఏండ్లు జీవించి 1899 జూలై 24న దేహాన్ని చాలించారు.
సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్ మంగళాని భవంతు
ఓం శాంతి: శాంతి: శాంతి :
జక్కా వేణి మాధవి
www.vedicvanas.com