Samskruti Kumbh
అణువణువునా జీవం నింపి జీవిత సత్యాలను నేర్పే జీవనది
Veni Madhavi, Editor
jmveni@gmail.com
కృష్ణమ్మ పాదం మోపిన అణువణువుకీ ప్రాణం పోస్తూ ఆ పరిసర ప్రాంతాలన్నింటిని సస్య శ్యామలం చేస్తుంది. ఈ విధంగా కొన్ని వందలు కాదు సుమా, కొన్ని వేల సంవత్సరాలనుంచి నిరాటంకంగా చేస్తుంది. కృత, త్రేతా, ద్వాపర యుగాలనుంచి కలి యుగంలో కూడా నిరంతరం ప్రవహిస్తూనే వుంది కదా. ఆ మాటకొస్తే ప్రపంచంలోని ప్రతి జీవ నదీ కూడా ఇటువంటి పనినే చేస్తోందనవచ్చు. అయినప్పటికినీ దేని ప్రత్యేకత దానిదే. మనుషులందరూ ఒక్కటే అయినా ఎవరి ప్రత్యేకత వారిదే అయినట్లు. మరి మన కృష్ణమ్మ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, దాని తీరం వెంబడి వున్న పుణ్య క్షేత్రాలు, ప్రస్తుత వాస్తవిక పరిస్థితులు, పర్యావరణ పరమైన ప్రత్యేకతలు, వింతలు విశేషాల గురించి ఆమెతో పాటుగా కలిసి ప్రయాణించి తెలుసుకొందాము.
మహాబలేశ్వర్: –
పడమర కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో గల మహాబలేశ్వర్ ప్రాంతం మన కృష్ణమ్మ పుడుతున్న స్థానం. ఇక్కడ మనం కృష్ణవేణి గా పిలిచే తల్లిని వారు కృష్ణాబాయ్, కృష్ణాదేవి గా పిలుస్తారు. ఈ పర్వతాల్లోనే ఐదు నదులు పుట్టాయి. కృష్ణా, గాయత్రి, సావిత్రి, కోయనా, వెన్న ఇవన్నీ కూడా కృష్ణా నదికి ఉపనదులు – అందుకే ఈ ప్రాంతాన్ని పంచగంగ అని కూడా పిలుస్తారు. ఒకానొక సందర్భంలో సతీ సావిత్రి త్రిముర్తులకి ఇచ్చిన శాపం వల్ల వారు ముగ్గురూ నదులుగా మారారట. బ్రహ్మ – వెన్నా నదిగా, విష్ణువు కృష్ణా నదిగా, శివుడు కోయనా నదిగా మారి ప్రవహిస్తున్నారని ఇక్కడి వారు కధ చెప్పుకుంటుంటారు. అందుకే ఇక్కడి నీరు గోముఖం నుంచి పారుతుందని వారి నమ్మకం. ఇందుకు తార్కాణంగా ఇక్కడ ఉన్న గుళ్ళో శివ లింగం, కృష్ణాదేవి విగ్రహాలను చూడవచ్చు.
ఈ కట్టడం సుమారు ఏడు శతాబ్దాల క్రితంది. ఇక్కడి గో ముఖం నుంచి నీటి కుండంలోకి నీరు నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. అదే పోను పోనూ ఉపనదులను కలుపుకుంటూ మహానదిగా రూపాంతరం చెందుతుంది.
పండరీపురం – శ్రీ పాండురంగ విఠలుడు, రుక్మిణీ దేవి.
పండరీపురం బీమా నదీ తీరంలో వుంది. ఇది కృష్ణా నదికి ముఖ్య ఉపనది. పండరీపురం వద్ద ఇది అర్ధ చంద్రాకారంలో వుండటం చేత దీనిని చంద్రబాగా నది అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో నామధారుడు, భక్త తుకారాం, పురంధర దాసు, గోరాకుంబార్, ఏక్ నాద్ వంటి ఎందరో భక్తులు తరించారు. మన కృష్ణమ్మ ఆ నీలమేఘ శ్యాముని పేరు పెట్టుకున్నందుకు పండరీ విఠళుని పాద స్పర్శతో పునీతమై ఆ పేరుకు సార్ధకతను తెచ్చుకుంది.
ఇక్కడి స్థల పురాణాన్ని చూస్తే, పుండలీకుడు అనే భక్తుడిని పరీక్షించదలచిన శ్రీ కృష్ణుడు స్వయంగా వచ్చిఅడుగిడిన ప్రదేశం ఇది. తన తల్లితండ్రులను సేవిస్తున్న పుండలీకుడికి వచ్చినది కృష్ణుడని తెలిసినప్పటికినీ వారికి చేస్తున్న సేవను మధ్యలో విడువలేక, బయట వాన పడుతుండటం చేత ఒక ఇటుకను బయటకు విసిరి, కృష్ణుణ్ణి దానిపై కొద్ది వ్యవధి వేచి వుండమని చెప్తాడు. అతడు అలాగే దానిపై నిలబడి ఎదురుచూస్తూ వుంటాడు. కొంత సమయానికి, స్వామి కోపగించి వుంటాడని భయపడుతూ బయటకు వచ్చిన పుండలీకుడు వూహించని విధంగా శ్రీ కృష్ణ పరమాత్ముడు తల్లి తండ్రుల పట్ల అతడికి వున్న భక్తి ప్రపత్తులకు అమితానంద భరితుడై వరం కోరుకోమనగా అతడు తనకోసం దిగివచ్చిన కృష్ణుణ్ణి అక్కడ వెలసి భక్తులను అనుగ్రహించమని వేడుకొంటాడు. ‘విట్‌తో-బా’ అంటే ‘ఇటుక మీదున్న తండ్రి’ అని ఒక అర్ధం. ఆ ప్రదేశమే పండరీపురంగా ప్రసిద్ధి గాంచింది. (ప్రచారంలో వున్న అనేక గాధల్లోకి ఇది ఒకటి)
భీమశంకరం – జ్యోతిర్లింగం:
ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. వివిధ పురాణ గాధలు వున్న ఈ పుణ్య క్షేత్రంలోని బీమానది సాక్షాత్తూ శివుని స్వేదం అంటే చమట నుంచి ఏర్పడటం విశేషం.
గాణ్గాపురం:
గాణ్గాపురం శ్రీ దత్త క్షేత్రాల్లోకి ఇది ఎంతో విశిష్టత కలిగివుంది. ఇక్కడ సాక్షాత్తూ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి పాదుకలను పూజించడం అత్యంత విశేషం. (విష్ణు మూర్తి అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈయనా వేరు వేరు అని గమనించగలరు.) ఈ క్షేత్రం బీమా అమరజా నదుల సంఘమ తీర్ధం కావటం, ఇక్కడ పలువురు దత్త గురువులు అంతర్ధానం కావటం మరో విశేషం.
శ్రీ శైలం మల్లికార్జునుడు, భ్రమరాంబా దేవి:
కృష్ణమ్మ మహారాష్ట్రలో పుట్టి పునీతమై మన తెలుగు గడ్డపై అడుగిడి మరింత వైశిష్ట్యతను తెచ్చుకుంది. శ్రీ శైల క్షేత్రంలోని మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కాగా శ్రీ భ్రమరాంబికా అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరు కావటం చేత ఇది అత్యంత శక్తిమంతమైన మహోన్నతమైన పుణ్య క్షేత్రంగా అలరారుతుంది. వీరిని వొడిసి పట్టుకున్న నల్లమలా అడవుల్ని కృష్ణమ్మ తన పవిత్ర జలాలతో సస్య స్యామలంగా చేస్తుంది.
బెజవాడ కనకదుర్గమ్మ:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువుదీరి వున్న ఇంద్రకీలాద్రి పర్వతాన్ని తాకుతూ కృష్ణమ్మ మరింత పునీతమై పరవళ్ళు తొక్కుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ పర్వతంపై శివుని గూర్చిఅర్జునుడు, అమ్మవారికోసం ఇంద్రకీలుడు తపమాచరించినట్లు, అమ్మవారు మహిషాసురుడిని ఈ ప్రాంతంలో వధించి స్వయంభువుగా వెలసినట్లు శ్రీ కాళికా పురాణం, దుర్గా సప్తశతి మొదలగు వాటిలో ప్రస్తావించటం చూడవచ్చు.
దసరా నవరాత్రి సమయంలో శ్రీ దుర్గా మల్లెశ్వర్లు కృష్ణా నదిలో తెప్పోత్సవం – కృష్ణానదిలో విహరించడం అత్యంత వైభవోపేతంగా, కన్నులవిందుగా జరుగుతుంది.
అమరలింగేశ్వర స్వామి – అమరావతి:
ఈ శివలింగాన్ని ఇంద్రుడు స్థాపించినట్లు స్థలపురాణం చెబుతుంది. ఇది సన్నగా పొడుగ్గా వుంటుంది. ఈ లింగం పెరుగుతూ వుండేదట. దాన్ని ఆపెదానికి ఒక మేకుని కొట్టగా అక్కడి నుంచి కారిన రక్తం మారక ఇప్పటికీ కనిపిస్తుందంట. శ్రీ అమరలింగేశ్వర స్వామి శ్రీ బాల చముండికా దేవితో కూడి వున్న ఈ పవిత్ర ప్రదేశంలో మన నూతన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పడటం పరమోత్క్రుష్టమైన విషయం.
హంసల దీవి:
చివరకి కృష్ణమ్మ హంసల దీవి వద్ద తన గమ్య స్థానమైన సముద్రుణ్ణి చేరుతుంది.
ఇటువంటి యుగయుగాల పుణ్య చరిత్ర గల నదీమతల్లి గురించి వింటుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. ఇప్పుడే వెళ్లి ఆ చల్లని తల్లి పాదోదకాన్ని తలపై చల్లుకొని పునీతుల మవ్వాలనిపిస్తుంది. ఇక పవిత్ర పుష్కర సమయంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగి ధన్యుల మౌతామనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. (కృష్ణా నది తీరం వెంట వున్నఅనేక పుణ్య క్షేత్రాల్లోకి ఇవి కొన్ని మాత్రమే)
మన పరిసరాలు, మన చుట్టూ వున్న ప్రకృతే మనకి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంటాయి. శ్రీ దతాత్రేయుడు తనకి 24మంది గురువులు వున్నట్లు చెప్పటం ‘శ్రీ గురు చరిత్ర’లో చూడవచ్చు. అవి సాధారణ వస్తువులే, అందరికీ అన్నీ ప్రతి రోజూ కనిపించేవే. కానీ అవి మనము అన్వయించు కోవడంలోనే వుంది అసలు కీలకం అంతా. కృష్ణా నది తన పుట్టుక మొదలుకొని గమ్య స్థానం చేరే వరకు ఎన్ని మలుపులు, మజిలీలు, లోతులు, ఎత్తులు, అడ్డంకులు, జారుబండలు, జలపాతాల వంటి అవాంతరాలు ఎన్ని వచ్చినా, అన్ని వొదిదుడుకులను జయించి సాగరున్ని చేరే తీరును చూస్తుంటే ఒక మనిషి జీవితంలానే వుంది కదూ. ఒక జీవ నది కూడా మనకి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది.
ఒక వస్తువు యొక్క భావం ఆ వస్తువులో లేదు, చూసే మనస్సు, కళ్ళలోనే వుంది. ఒకే విషయాన్ని వంద మంది వెయ్యి రకాలుగా అన్వయించుకోవచ్చు, అది చూసే వారి దృష్టిలో వుంటుంది.
నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు . ఒక విధంగా చూస్తే పల్లం అంటే దిగజారటం అని అర్ధం. దాన్నే మరో విధంగా చూస్తే నీలోకి నువ్వు లోతుగా, నీ మూలాల్లోకి వెళ్లటం అని కూడా చెప్పవచ్చు.
ఒక కొండ అడ్డం వచ్చినప్పుడు నదీ ప్రవాహం ఆగిపోయినట్లనిపిస్తుంది. కానీ కొంత కాలానికి అది ఆ ఎత్తును జయించి జలపాతంలా మారి తిరిగి వురకలు వేయటం ప్రారంభిస్తుంది.
ఒక నదిలో ముందు ఒక కాలు పెట్టి, తరువాత రెండవ కాలుని అదే నదిలో పెట్టలేము అని ఒక సిద్ధ పురుషుడు చెప్పాడు.(రెండు కాళ్ళు ఎత్తి ఒకేసారి దూకటం అన్నది వేరే విషయం) దీనిని కొంచెం సుక్ష్మంగా ఆలోచించాలి. మనము ఒక కాలు పెట్టి రెండవ కాలు పెట్టే లోపల ఆ నీరు వెళ్ళిపోయి క్రొత్త నీరు వస్తుంది. నిరంతరం నీరు మారుతూనే వుంటుంది. క్షణ క్షణానికీ నది మారిపోతునే వుంటుంది. కానీ అది వేరే నదైపోదు.
దీనినే మనకి అన్వయిన్చుకొంటే, మనలోని కణజాలం నిరంతరం సృష్టించబడుతుంది, అలాగే నశించిపోతు వుంటుంది కూడా. మనము పుట్టినప్పుడు వున్న రక్త, మాంస, ఎముకలు, చర్మం మొదలగు వాటికి సంబంధించిన ఒక్క కణం కూడా ఇప్పుడు వుండదు. అలాగని మనం మనం కాకుండా పోము కదా. నదిలో ప్రస్తుతం వున్న నీరు సముద్రంలో కలిసిపోతుంది, నిరంతరం క్రొత్త నీరు చేరుతుంది, అయినప్పటికీ దానిని యుగయుగాలుగా అదే పేరుతో పిలుస్తున్నాము కదా.
సమయం అన్నది నైరూప్యమైనది ( abstract thing) ఒక నదీ ప్రవాహాన్ని సమయంగా అన్వయిన్చుకొంటే కదులుతూ కళ్ళకి కనిపించే గడియారమే పారుతున్న నదిలా అనిపిస్తుంది.
సాగితే స్వచ్చం, ఆగితే మురుగు – నదిలోని నీరు పారుతున్నంతసేపు స్వచ్చంగా వుంటుంది. ఒక్కసారి ప్రవాహం ఆగిందంటే మురికి, పాకుడు, చెత్తా చెదారం వంటివి చేరతాయి. ఈ సూత్రాన్ని ఇలా చూడవచ్చు - మనకి వున్న జ్ఞానాన్ని నలుగురికీ పంచినప్పుడే మనలోకి కొత్త జ్ఞానం వస్తుంది. కేవలం జ్ఞానమే కాదు మన వద్ద వున్న ధనము, వస్తువులు కూడా వున్నంతలో కొంత దాన ధర్మాలు చెయ్యమని పెద్దలు చెప్తుంటారు. దాచి పెట్టుకున్నది దోచుకోబడుతుంది లేదా మురిగి పోతుంది. పంచిపెట్టింది పెంచబడుతుంది తిరిగి మనకే అనుకొని రీతిలో అనుకుల పరిస్థితులను కల్పిస్తుంది. దానినే అ-దృష్టం అంటే కనిపించనిది అని సామాన్య అర్ధం. మనం వూహించని రీతిలో కలిసివస్తుంది. మనకి మన పెద్దలు చేసిన మంచే మనల్ని నీడలా కాపాడుతుంది. మనము చేసిన సత్కార్యాలు సత్కర్మలే మన భవిష్యత్ తరాలవారికి అండగా నిలుస్తాయి.
తన కడుపులో ఎన్ని నిగూఢ నిధులు, గనులు, రత్నాలు మాణిక్యాలు దాగున్నా పైకి మాత్రం గుమ్బనంగా నిరాడంబరంగా ఏమీ ఎరగనట్లు సాగిపోతు వుంటుంది.
ఒక నదీ తీరంలో సంధ్య వేళ, స్థిమితంగా, ప్రశాంతంగా, మౌనంగా కూర్చొని కొంత సమయం గడిపితే, అది మనకు అనేకానేక లోతైన కధలు, అంతరార్ధాలు, జీవిత సత్యాలను ప్రభోదిస్తుంది.
ఇక సత్య యుగంలోంచి కలియుగంలోకి అడుగిడిన కృష్ణమ్మ గురించిన వాస్తవ పరిస్థితిని అంకెలతో అవగతంచేసుకొందాం.
కృష్ణానది దాదాపు 1400 కిమి పొడవు వుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల ద్వారా ప్రవహించి హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. దీనికి 13 ముఖ్య ఉపనదులు వున్నాయి. ఇది పడమటి కనుమల నుంచి తూర్పు కనులమ వైపు పయనిస్తుంది. గంగ, గోదావరి, బ్రహ్మపుత్రల తరువాత ఇది మన దేశంలోనే నాల్గవ అతి పెద్ద జీవ నది.
ఉపనదులు – 13
ప్రధాన ఉపనదులు - ఘటప్రభ, మాలప్రభ, భీమ, తుంగభద్ర, మూసి.
ఆంధ్ర ప్రదేశ్ లోనివి - పాలేరు, మున్నేరు, పోలవరం, బుడమేరు.
మూసి నది:
సందర్భం వచ్చింది కనుక ఈ నది గురించి క్లుప్తంగా కొన్ని సంగతులు. ఒకప్పుడు ఇది మన భాగ్యనగరానికి మంచి నీటిని అందించిన నది. ఇది వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో పుట్టి 240కిమీ. ప్రవహించి, నల్గొండలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. పూర్వం దీనిని ముచుకుందా నది అని పిలిచేవారు. 1908,సెప్టెంబరు 28న అతి భారీ వర్షం కురిసిన కారణంగా వరద వచ్చి సుమారు 15,000 చనిపోయినట్లు తెలుస్తుంది. ఆ పిమ్మట దీనిపై అధ్యయనాలు చేసి దశలవారీగా 1920, 1927 ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ వద్ద డ్యాములు కట్టి భాగ్యనగరానికి తిరిగి ఆ ముప్పు కలుగకుండా చేసారు. నమ్మసఖ్యంగా లేదు కదూ. ఇదేదో పురాణ గాధలా అనిపిస్తుంది. మూసీ నదికి ఒక వైపు ప్రస్తుతం మనం పాత నగరంగా పిలిచే ప్రాంతం వుండేది. కాల క్రమేణా దాని రెండవ ప్రక్క కొత్త నగరం అతి వేగ వంతంగా విస్తరించింది. దానితో పాటు ఒక నియమం, నియంత్రణ, పద్ధతి అన్నవి లేకుండా కలుషిత జలాలు, మురుగు నీటిని, వ్యర్ధాలను ఈ నదిలోకి వదిలేవారు. దాని పర్యవసానం మన కళ్ళెదురుగా కనిపిస్తుంది.
హై కోర్ట్ , అఫ్ జల్ వంతెన, మూసి నది ప్రస్తుత పరిస్థితి:
ఈ తరం పిల్లలకు అది కేవలం ఒక మురిక్కాలవగా మాత్రమే తెలుసు అనడం అతి శయోక్తి కాదు. ఇప్పటి వరకు దానిని ప్రక్షాళన చేయటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రపంచ దేశాల్లోని ఎన్నో ప్రాంతాల్లో, నదీ తీరాల వెంట చిన్నా పెద్దా నగరాలను చూడవచ్చు. అక్కడి నదీ జలాలు ఎంతో స్వచ్చంగా, తేటగా వుండటం గమనార్హం. మనం తలచుకుంటే అసాధ్యమన్నది లేదు. అంతా మన చేతులు, మనసుల్లోనే వుంది.
తిరిగి మన ప్రధానాంశం లోకి వస్తే .....
నీటి పారుదల ప్రాజెక్టులు – 204
కృష్ణా నది పై వున్న మొత్తం 204లోకి ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రాజెక్టులు 16.
డ్యాములు – మొత్తం నదిపై 661
ఆంధ్రాలొ ఏడు.
అక్కవాని పాలెం డ్యాము – తిరువూరు.
భైరవాని తిప్ప డ్యాము – అనంతపూర్ జిల్లా.
బుగ్గవాగు డ్యాము – గురజాల, గుంటూరు జిల్లా.
గాజుల దిన్నె (సంజీవయ్య సాగర్) డ్యాము – పత్తికొండ, కర్నూలు జిల్లా.
నాగురూర్ డ్యాము – కర్నూలు
పులిచింతల – హుజూర్ నగర్ – నల్గొండ జిల్లా.
వరదరాజ స్వామి గుడి డ్యాము – ఆత్మకూర్, కర్నూల్ జిల్లా.
బ్యారేజీలు / ఆనకట్టలు – 75
ఆంధ్ర రాష్ట్రంలొ రెండు.
మున్నేరు ఆనకట్ట – జగ్గయ్య పేట,
ప్రకాశం బ్యారేజీ - విజయవాడ.
ఎత్తి పోతల పధకాలు – 121
ఆంధ్ర రాష్ట్రంలొ రెండు.
గురురాఘవేంద్ర ఎత్తిపోతల పధకం.
హంద్రీనీవ సుజల స్రవంతి ఎత్తిపోతల పధకం.
జల విద్యుధుత్పత్తి ప్రాజెక్టులు – 25
మన రాష్ట్రంలోవి
నాగార్జున సాగర్.
శ్రీశైలం.
తుంగభద్రా.
విద్యుత్ కేంద్రాలు – 35
నాగార్జున సాగర్ కుడి కాలువ.
శ్రీశైలం కుడి ప్రక్క, పులిచింతల.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కృష్ణమ్మ పుట్టుక మొదలు తన గమ్యం చేరే లోపు భౌతికంగా ఎన్ని పనులు చేస్తుందో తెలుసుకుందామని, ఈ విషయాలను అతి క్లుప్తంగా ఇచ్చాను. ఇవన్నీ కూడా కేవలం మానవాళికి జరిగే మేలు మాత్రమే. అటు త్రాగునీరు, వ్యవసాయానికి గానూ, ఇటు విధ్యుధుత్పత్తికి గానూ ఈ నీటిని వినియోగించడం జరుగుతుంది. ఈ సంఖ్యలను చూస్తేనే ఈ నదీ జలాల వల్ల ఎన్ని లక్షలు, కోట్ల మంది ప్రజలు మేలు పొందితున్నారో మీరే అంచనా వేసుకోండి.
మరి ఇక పర్యావరణ పరంగా చూస్తే:
మొత్తం మీద 17 అభయారణ్యాలు వున్నాయి. మన రాష్ట్రంలో వున్నవి – రోళ్ళపాడు మరియు శ్రీ శైలం-నాగార్జునసాగర్ ల్లో వున్నాయి.
దగ్గర దగ్గర 10 జలపాతాలు వున్నాయి.
ఆంధ్రలో *ఎత్తిపోతల (‘యతి తపోస్థల’ మాచెర్ల నుంచి నాగార్జున సాగర్ కు వెళ్ళే దారిలో వుంటుంది)
తెలంగాణాలో మల్లెల తీర్ధం(శ్రీశైలంకి 58కిమీ దూరంలో, హైదరాబాద్ వైపు వెళ్ళే దారిలో వుంటుంది.) – ఇక్కడ మునులు తపస్సు చేసుకొనేవారట, వారిలో పలువురికి శివుడి దర్శనమైనట్లు చెప్పుకొంటారు. ఈ నీటిని త్రాగే దానికి ఇక్కడి నల్లమల అడవుల్లోని పులులు ఇతర జంతువులు వస్తుంటాయట.
*(ఒకప్పుడు ఇక్కడి గుహల్లో యతులు ఋషులు తపస్సు చేసుకొనేవారట – ఆ కారణం చేత దీని అసలు పేరు యతి తపోస్థల. ఈ పేరుకీ, ప్రభుత్వం వారు చేపట్టే కృత్తిమ ఎత్తిపోతల పధకానికీ[Lift Irrigation Projects] గల వ్యత్యాసాన్ని గమనించగలరు.)
[Content Source: Water Resources Information System of India and National Institute of Hydrology]
[ Photos: Wikipedia and G.Brahma Reddy]
దీనిపై వున్న డ్యాములు ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటుంటే ఈ పుణ్య నది మానవాళికి చేస్తున్న మేలు వెలకట్ట లేనిదని అర్ధమౌతుంది.
ఇంతటి పునీతమైన ప్రాంతాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మనం కేవలం మన సుఖ సంతోషాల కోసం స్వార్ధ పూరితంగా వ్యవహరిస్తున్నాము. అనేక జీవులే కాక జీవ నదులు కూడా కలుషితమై అంతరించిపోయే పరిస్థితులకు దారి తీస్తున్నాము. ఈ బాహ్య స్థితిగతులు మన మనస్సులోని భావాలకు నిట్ట నిలువుటద్దం. మన పరిసరాలు, మన నదులు మనలోని స్వార్ధం, మలినాలు, కలుషితాల్ని ప్రతిబింబిస్తున్నాయి.
అధికారిక స్థాయి నుంచి ఎన్నో ప్రణాలికలు వస్తున్నప్పటికిను ఫలితాలు అంతంత మాత్రంగానే వున్నాయి. మనం కేవలం పుష్కర సమయంలో పుణ్య స్నానాలను ఆచరించడమే కాకుండా మన వల్ల కలుషితం కాకుండా చూస్తే ఆ పుణ్య నదీమతల్లికి మేలు చేసిన వారమౌతాము.
శ్రీ రామ చంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాస సమయంలో అయోధ్య మొదలుకొని రామేశ్వరం, శ్రీ లంక వరకు తన పవిత్ర పాదస్పర్శతో పావన మాయం చేసాడు. దారిలోని నదులను పునీతం చేసాడు. వారు సాక్షాత్తు ఈ నెల పైనే నడిచారు, ఈ గాలినే పీల్చారు, ఈ నీటినే త్రాగారు, ఇక్కడ పండే కందమూలాలు, పండ్లనే స్వీకరించారు. మరి అటువంటి పుణ్య భూమిపై మనిషిగా పుట్టిన మనమందరం ఎంతో అదృష్టవంతులం. ఇన్ని యుగాలుగా ఇన్ని లక్షలు కోట్ల జీవ రాశులకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గాలి, నీరు, ఆహారదానం చేసి పుణ్య నదిగా అలరారుతున్న కృష్ణమ్మ యొక్క శక్తి, తేజము, చైతన్యము తారా స్థాయిలో వున్న పుష్కర సమయంలో ముడు మునకలు వేసి స్నానం చేసి, దానధర్మాలు, సత్కర్మలు ఆచరించిన వారి పాపాలు తప్పక తొలగి వారు పునీతులు కాగలరు. నిస్వార్ధంగా ఇన్ని వందల వేల లక్షల కోటాను కోట్ల జీవరాశికి ప్రాణ దానం చేస్తున్న మన జీవ నదులను, మన కృష్ణమ్మను నిరంతరం స్వచ్చంగా కళకళలాడుతూ కలకాలం గలగలా ప్రవహిస్తూవుండాలని కోరుకుంటూ లోకాన్ సమస్తా సుఖినో భవంతు!!!