తెలుగుపరిశోధన వెబ్ సైట్ అధ్వర్యంలో తెలుగుపరిశోధకుల వివరాలు పొందుపరచాలని సంకల్పించాము. ఆ వివరాలు ఇచ్చిన నమూనాలో నింపి చేరిస్తే భావిపరిశోధకులకు ఉపయోగకరంగా ఉంటుంది.

తెలుగులో జరిగిన పరిశోధనల వివరాలను తెలుపుతూ మొదట ఆం.ప్ర.సాహిత్యపరిషత్ వారు గతంలో ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే పేరుతో పుస్తకం అచ్చు వేసారు. అది పరిశోధకులకు మార్గదర్శకంగా ఉండేది. కానీ అది ప్రస్తుతం కాపీలు చెల్లి పునర్ముద్రణ లేక లభించడం లేదు.

ఆ తర్వత డా.వెల్దండ నిత్యానంద రావు వ్యక్తిగతంగా పూనుకొని 1988 సం.లో మరియు 1998 సం.లో అప్పటివరకు వెలువడిన సమాచారాన్ని సేకరించి ప్రకటించారు.

ఈ మధ్యే సి.పి.బ్రౌన్ అకాడమీ వారు ‘తెలుగు పరిశోధనా వ్యాసమంజరి’ పేరుతో 2005-2007 మధ్యకాలంలో వెలువడిన పరిశోధనల సారసంగ్రహాలను 60 వరకు సంగ్రహించి ప్రకటించింది.అందులో కొంతవరకు పరిశొధనలకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.దానికీ సంపాదకులు డా.వెల్దండ నిత్యానందరావుగారే.

ఆ పుస్తకాలు వెలువడినప్పుడు విద్యార్థిలోకానికి జరిగిన ఉపకారం అవి కొద్దికాలంలోనే చెల్లుబాటుకావడలోనే తెలుస్తుంది. ఆ పుస్తకాలను విద్యార్థులు, ఆచార్యులూ  కరదీపికలుగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగవల్సిందే.ఎప్పటికప్పుడు ఆ యా పరిశోధన విశేషాలను ఇంటర్ నెట్ లో పెట్టడం ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాలనేది సంకల్పం. దీనికి కేవలం ఏ ఒక్కరో పూనుకొంటే అయ్యేది కాదు. విద్యార్థులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులూ అందరూ మనస్ఫూర్తిగా సహకరించిననాడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి.