వైష్ణవ పరంపరా ప్రకాశిక

ఉపదేశ రత్నాలు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు

ఆలయ దర్శిని

సాహిత్యం

గురు పరంపర

అమ్మ ఉంటేనే జగత్ రక్షణ


భగవంతుడిలోని దయ మనల్ని ఎట్లా కాపాడుతుంది ? ఎట్లా రక్షిస్తాడు ? రక్షణ అంటే ఏమి ? రక్షించడానికి ఏమేమి పరికరాలు కావాలి ? రక్షణ పొందడానికి మనం ఎం చేయాలి ? ప్రపంచంయొక్క సృష్టి, స్థితి, ప్రళయము కార్యాలను భగవంతుడు దయతో చేస్తాడు అని శాస్త్రం చెబుతుంది. సృష్టి, స్థితి అంటే దయతో చేసేవి, ప్రళయం కూడా దయతో చేస్తాడా అనేది ఒక సందేహం. పద్మ పురాణం చెప్పిన విష్యం 'ప్రళయం కూడా దయా కార్యమే'. దీన్ని పిళ్ళై లోకాచార్య స్వామి నిరూపించారు. ఎన్నో జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ సంస్కారాలని మోసుకు తిరుగుతుంటాం. భగవంతుడు మనల్ని తయరు చేయలేదు, మనం ఎప్పటి నుండో ఉన్నాం. మనం అల్పులం, ఆయన దయా సాగరుడు కనక ఉపకారం చేయాలని అనుకుంటాడు. ఆదయ ప్రభావంచేతనే మన కష్టాలని దూరంచేయాలని అనుకుంటాడు. మనకు కర్మ ఎంతకాలంగా ఉందో తెలియదు, మనల్ని మనం మరచి ప్రవర్థించే జీవుడి దుస్థితిని చూసి జాలి పడి, తాను ఎట్లా అయితే ఆనందం అనుభవిస్తున్నాడో జీవుల్లు కూడా అంత ఆనందం పొందగలిగే స్థితికి అర్హత కల వారు అని తలచి, తనంత స్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని ఇస్తాడు. దానితో కర్మ త్వరగా తొలగించుకోవచ్చు అని. మనకుండే కర్మను బట్టి ప్రకృతిలో ఎట్లాంటి శరీరం ఇస్తే తొలగుతుందో చూసి అట్లాంటి శరీరం ఇస్తాడు. శరీరం ఇవ్వడం అనేది దయతో చేసిన కార్యమే. ఇంద్రియాలను, మనస్సును, బుద్దిని, మన చుట్టూ సమాజం, ప్రాణి కోటి ఇలా ఎన్నో ఇచ్చాడు. శరీరానికి ఏర్పడ్డ అవసరాలని ఇస్తూ రక్షణ చేస్తాడు.  ఇదీ దయతోనే చేస్తాడు. ఇంత దయతో చేసినవాడు, మరి ఒకనాడు వాడిని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు దయ లేనివాడు అని అనిపిస్తుంది, కానీ అది కూడా దయతో చేసే పని. ఒక్కో వస్తువు తయారు చేసుకున్నప్పుడు దాన్ని ఒక్కో అవసరం కోసం తయారు చేసుకుంటాం. ఒక వస్త్రాన్ని మనం శరీరాన్ని కాపాడుకోవడానికి ధరిస్తాం. శరీరం అట్లాంటిదే. వస్త్రాన్ని ఒక్క రోజు ధరిస్తాం, శరీరాన్ని జన్మ కాలం ఎంతో అంత కాలం ధరిస్తాం. ఒక్కోసారి వస్త్రం మాసిపోతే, రోజంతా ఉంచుకోం కదా. తీసి మరొకటి ధరిస్తాం. అది పాడవనంత వరకు వాడుకుంటాం. అట్లా శరీరం ఒక అవసరం కోసం వస్తుంది, అది అయ్యాక తీసేయాల్సి వస్తుంది. దీన్నే మరణం అని అంటారు. దీన్నే ప్రళయం అని అంటారు. ఇది కూడా దయతో చేసేది.


మనకు కావాల్సిన విషయాలను మన చుట్టూ ఉన్నవారితో చెప్పిస్తాడు, లేకుంటే గురువుల ద్వారా చెప్పిస్తాడు. అది వీలు పడనప్పుడు తానే ఈ లోకంలో అవతరిస్తాడు. నరసింహుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు ఆయా సందర్భాన్ని బట్టి ఉపకారం చెయ్యడానికి వీలయ్యే అవతారంలో వస్తాడు. మనం ఆయనని ఆరాదించాలంటే విగ్రహం ద్వారానే కదా, దానికి ఆధారం ఇచ్చేది అవతారమే. మనకు తోచినట్లుగా విగ్రహాలు చేసుకోం. ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాడు, ఆ కాలం నియమం ప్రకారం నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు, అంతకు ముందు త్రేతాయుగంలో రాముడిగా వచ్చినప్పుడు పదకొండు వేల సంవత్సరాల కాలం ఉన్నాడు. లోకంలో తాను వచ్చి, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలె నడచి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పడే సుఖదుఖాలు తానూ అనుభవిస్తే తప్ప మనకు చెప్పలేడు కనుక తానూ అట్లా అనుభవించాడు. భగవంతుడు ఊరికె చెబితే ఎదుటి వారికి నచ్చదు కనక, మన వలె తానూ అనుభవించి చెప్పాలని మన వద్దకి రాముడిగా వచ్చాడు. నరసింహ అవతారం ఆయన ఒక్కసారిగా స్థంభంలోంచి వచ్చాడు, కానీ రామావతారంకోసం ఆయన నిజంగా పుట్టాడు. ఒక సంవత్సర కాలం గర్భవాసం చేసాడు. నిజంగా పెరిగాడు, నిజంగా తిరిగాడు, నిజంగా  గురువులని అనువర్తించాడు. అట్లా ఈ లోకంలోకి వచ్చినప్పుడు లౌకికమైన ప్రభావాలు ఆయనపై పడకుండా కాపాడగల్గిన తేజస్వరూపిణి అమ్మ. ఆయన హడావిడిలో నేరుగా వస్తాడు, వచ్చి పూర్తిగా మనిషిగా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె వెనకాతల ఏమేమి కావాలో అన్ని పరికరాలతో జాగ్రత్తగా వస్తుంది. రక్షణ జరిగేది ఆయన వెంట అమ్మ ఉన్నప్పుడే. ఒంటరిగా ఎప్పుడూ రక్షణ చేయడు, ఆయన వెంట శక్తి, యుక్తి, దయ, సౌలబ్యం, సౌశీల్యం ఇలా ఎన్నో ఉండాలి. ఈ కళ్యాణ గుణాలు పైకి రప్పించే అమ్మ ప్రక్కన ఉండాలి. భగవంతుడు రాముడిగా వచ్చినా, ఆయనలో దయని పైకి తేవడానికి అమ్మ సీతగా వచ్చింది. భగవంతుడిని ఆశ్రయించడానికి అమ్మ ప్రక్కన ఉంటే మనలోని లోపాలని చూడ కుండా చేసి ఆయనలోన అణిగి ఉండే ప్రేమ, వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చి మనల్ని అనుగ్రహించేట్టు చెప్పగల్గుతుంది. రక్షణ చేయాలంటే ఆమె సాన్నిద్యం ఆయనకి కూడా అవసరం. అట్లా రక్షణ కోసం చేసే కార్యాల్లో ప్రధానమైనది సీతమ్మను వివాహ మాడటం. అమ్మ తన వెంట లేక పోయినట్లయితే, స్వామీ! నీవే కనక అమ్మను స్వీకరించకపోయినట్లయితే, అమ్మ వెంట లేక నీవు అడవిలో సంచరించినట్లయితే "అసరస మభవిశ్యన్" అని అంటారు పరాశరబట్టర్ వారు. తాను అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అమ్మను తన వెంట రావద్దు అని చెప్పాడు స్వామి. కానీ 'నేను వెంట లేకుంటే నీవు చేయాల్సిన లోకరక్షణ జరగదయా' అని వెంట వచ్చింది అమ్మ. అవతారంలో భగవంతుడు గర్భవాసం చేసి వచ్చాడు, కానీ అమ్మ నేరుగా భూమిలోనే లభించింది. గోదాదేవి అట్లానే వచ్చింది. భగవంతుడు అప్పుడప్పుడు చేయాల్సినవి మరచిపోతుంటే, ఆయనకు చెప్పడానికి ఆమే అన్నీ తెలుసుకొని వస్తుంది.