కార్తీక మాసాన్ని అగ్ని మాసం అని అంటారు. మాసంలో వచ్చే పూర్ణిమ నాటికి ఏ నక్షత్రం పూర్ణిమతో చేరితే ముందు పదిహేను రోజులు శుక్ల పక్షం అని తరువాత పదిహేను రోజులను కృష్ణ పక్షం అని మొత్తం కలిపి చాంద్రమానంలో ఆయా నక్షత్రం పేరుతో మాసాన్ని వ్యవహరిస్తుంటారు. అదే సౌరమానంలో సూర్యుడు ఉండే రాశిని బట్టి మాసం పేరును వ్యవహరిస్తుంటారు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు కృత్తికా నక్షత్రం తోచేరి ఉంటాడు కనుక కార్తీకమాసం అని పేరు.
వేదంలో కృత్తికా నక్షత్రాన్నే మొదటి నక్షత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే కృత్తికా నక్షత్రం యొక్క అదిష్టానం అయిన దేవత అగ్ని. భగవంతుడు అగ్ని స్వరూపంలో ఈ ప్రకృతిలో అంతటా ఉంటాడు. అగ్ని లేకుంటే మనం బ్రతకలేం. చెట్లల్లో అగ్ని త్వరగా లభిస్తుంది. హోమాల్లో అగ్ని కోసం అశ్వత్తంలాంటి చెక్కను చిలికితే అందులోంచి అగ్నిహోత్రం వస్తుంది. అట్లా వైదికంగా జరిగే హోమ కార్యక్రమాల్లో చేస్తుంటారు. అందులోంచి అగ్ని వచ్చింది అంటే అంతకు ముందు కూడా ఉంటుంది కానీ ఒక పద్దతి ద్వారా చేస్తే బయటికి వస్తుంది. భగవంతుడు అగ్ని స్వరూపుడై వృక్షాల్లో అదివసించి ఉంటాడు. అందుకోసమే ఆగ్ని స్వరూపమైన భగవంతుని కోసమే కార్తీక వనభోజనం అని చేస్తుంటారు. వనాల్లో చెట్ల క్రిందే వండి స్వీకరిస్తారు, ఎందుకంటే చెట్ల నుండి వచ్చే శక్తిని తమ దేహాలకు అనుకూలపడేట్టు చేసుకోవడం అనేది ప్రధానం. దేవతల్లో అగ్ని చిన్న దేవుడు, విష్ణువు పెద్ద దేవుడు అని ఋగ్వేదం చెబుతుంది. కార్తీకమాసంలో అగ్నితో అంటే దీపాలతో పరమాత్మను లేపే ఉత్సవం చేసుకుంటాం. మొదటి పదిహేను రోజులు ఇండ్లల్లో, తరువాతి పదిహేను రోజులు ఆలయాల్లో దీపారోపన చేస్తుంటారు ఈ మాసంలో. అది భగవంతున్ని ఆరూపంలో ఆరాధించడం దానికి తాత్పర్యం. ఏకాదశినాడు స్వామిని మేల్కొనినట్టు దర్శనం చేసుకుంటాం, ద్వాదశి నాడు స్వామికి అభిషేకం చేసుకుంటాం. పూర్ణిమనాటి వరకు మనం చేసుకోవాల్సిన విన్నపాలు చేసుకుంటాం.
మన బాగు కోసం ఆయనకు మనం విన్నపించుకుందాం. భగవంతునికి విన్నపించుకోవడం అవసరమా ? ఆయనే అన్ని చేయించుకోగలడు కదా. మరి మనం ఎందుకు విన్నపించుకోవడం. ఒక పిల్లవాడిని మనం పాటం అడిగినట్లు, మనకు తెలియక కాదు కదా. పిల్లవాడు నేర్చుకుంటే మనకు ఆనందం. అట్లానే భగవంతుడు అన్నీ మన ద్వారా చేయించుకోవాలి అని అనుకుంటాడు పరమాత్మ. మనల్ని ఆయన పరికరాలుగా కావాలని భావిస్తాడు. ఆయనకు ఉపయోగపడటం మన భాధ్యత. ఈ మాసంలో దేవతలంతా ఒకచోటికి చేరుతారు కనుక, అక్కడ చీకటి అనేది ఉండకూడదు. అందుకే మన ఇండ్ల చుట్టూ చీకటి లేకుండా, దేవతల చూపు మనపై పడాలి, తద్వారా మనలోని తామస భావాలు తోలగిపోవాలి అనేది తాత్పర్యం.
కార్తీక పూర్ణిమ చాతుర్మాస్యం చిట్ట చివరి రోజు. ఆశాడ పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమతో చాతుర్మాస్యం ఆరంభమౌతుంది. సన్యాసులు కానీ, గృహస్తులు కానీ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ ఒకచోట ఉండి పరమాత్మను చేరడానికి వారి వారి యోగ్యతను అనుసరించి వారి వారి కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అలా మనం స్వామిని పోందాలని కోరుతుంటే, మరోపక్క మన కోసం ఏం ఏం చేస్తే తన దరిని చేరుతారు అని స్వామి మనకోసం వ్రతం చేస్తాడు ఈ నాలుగు మాసాలు. పాల కడలిలో తను యోగ నిద్రలో మన గురించి చింతిస్తూ ఉండే సమయం చాతుర్మాస్యం. చింతన చేస్తూ కార్తీక పూర్ణిమ నాటికి తను మనల్ని ఎలా బాగుచేయాలో ఆలోచన తట్టి నిద్రలేస్తాడు. ఈ సందర్భంగా మనం స్వామికి అనేక దీపాలతో మంగళం పాడుతూ ఉంటారు భక్తులు.
సూర్యుని కాంతి వేడిగా ఉంటుంది, చంద్రునికి సహజ కాంతి అంటూ లేకపోయినా కానీ అదే చంద్రుడి ద్వారా అందితే మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది. చంద్రకాంతిలో చల్లటి మంచులో ఔషదాలు పండుతాయి. అందుకే చంద్రునికి పేరు ఔషదీపతి. యతులకు ఈ నాడు ప్రధానం. అంటే జ్ఞానులైన మహానుభావులు చంద్రుని వంటి వారు. భగవంతుడు నేరుగా ఇచ్చినది మన మనస్సుకు ఎక్కదు. భగవత్ భక్తుడి ద్వారా చెప్పించడమే భగవంతుని సంకల్పం కూడా. ఇదే విషయం తాను భగవద్గీతలో చెప్పాడు. ఆచార్యుడు భగవత్ జ్ఞానాన్ని ఎట్లాంటి క్లేషలు లేకుండా అందించగలడు. అందుకే ఆండాళ్ తల్లి తిరుప్పావైలో మొదటి మరియూ చివరి పాశురాల్లో చంద్రుడినే స్తుతిస్తూ గురు స్మరణ చేస్తుంది. భగవంతుడు ఏకాదశి నాటికే లేచినా, అచార్యులు పూర్ణుమనాటి నుండే బయలుదేరుతారు. భగవంతుడు కోపాన్ని చూపగలడు, ప్రేమనీ చూపగలడు. జ్ఞానులు ప్రేమనే వర్షిస్తారు. జ్ఞానుల అనుగ్రహం అనేది చాలా అవసరం. అందుకే కార్తీక పూర్ణిమ చాలా ప్రధానమైన రోజు.
